KCR: ఆ ఎన్నికలే టార్గెట్‌గా బరిలోకి దిగుతున్న కేసీఆర్.. సూపర్ ప్లాన్..

రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించలేదు. ఆ తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారం చేశారు. అభ్యర్థుల తరఫున నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

Written By: Srinivas, Updated On : October 14, 2024 5:52 pm

KCR

Follow us on

KCR: రాష్ట్రంలో రెండు టర్ముల్లోనూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్న సెంటిమెంటుతో ప్రజలు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. దాంతో ఆయన పార్టీ బీఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ అనూహ్య ఫలితాలను ఎదుర్కొన్నారు. పదేళ్ల అధికార సామ్రాజ్యానికి బీటలు వారాయి. అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించలేదు. ఆ తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారం చేశారు. అభ్యర్థుల తరఫున నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒకప్పటి కేసీఆర్‌ను తలపించేలా ప్రసంగాలు చేశారు. కానీ.. ఆ ఎన్నికల్లోనూ పెద్దగా ఫలితాలు రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఒక్క అభ్యర్థి కూడా ఎంపీగా గెలవలేకపోయారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ పూర్తిగా ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు.

ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యాలపై కానీ.. ప్రజాసమస్యలపై కానీ ఒక్క స్టేట్‌మెంట్ కూడా కేసీఆర్ నుంచి రాలేదు. అటు వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డా నోరు మెదపలేదు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వైఖరి చర్చకు దారితీసింది. ప్రజల్లోనూ కేసీఆర్‌కు ఏమైంది అన్నట్లుగా చర్చ నడిచింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కేసీఆర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వేశారు. రకరకాల కామెంట్లు చేస్తూ వచ్చారు. అటు సీఎం రేవంత్ కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ ఓ అప్పీల్ కూడా చేశారు. సీనియర్ నేతగా తమకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. పాలనాపరంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా బయటకు రాలేదు. కేవలం బడ్జెట్ సమావేశాల వేళ మాత్రం ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై వెళ్లిపోయారు. ఇక ఆ తరువాత కనిపించలేదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే డిసెంబరు నుంచే ఆయన తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వ్యూహాలు సిద్ధం చేసినట్లుగా సమాచారం. డిసెంబరు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తికానుంది. దాంతో ఏడాది పాలనపై కేసీఆర్ ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఎజెండాగా మార్చుకొని రాజకీయాల్లో పుంజుకునేందుకు వ్యూహాలు రచించారని సమాచారం. సంక్రాంతి తరువాత రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారు.

కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ ముందు నుంచీ అనుకున్నారు. ఎట్టకేలకు ఏడాది పూర్తి కావస్తుండడంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించారు. నిత్యం కేసీఆర్‌తో భేటీ అవుతున్న నేతలకు కూడా ప్రజా సమస్యలపై పోరాడాలంటూ సూచిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా వేగంగా నడిపించాలని కార్యకర్తలకు చెబుతూ వచ్చారు. ముఖ్యంగా పార్టీలోకి యువ రక్తం వచ్చేలా ప్లాన్ చేయాలని సూచించారు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాక వీటన్నింటికీ కార్యాచరణ ప్రారంభించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.