YCP: ఏపీలో రెండోసారి అధికారంలోకి వస్తామని జగన్ గట్టిగానే చెబుతున్నారు. అటు పార్టీ శ్రేణులు సైతం అదే ధీమాతో ఉన్నాయి. కానీ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నాయి. పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటే.. వారంతా పార్టీని ఎందుకు వీడతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే అనంతపురం వరకు.. కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు వైసీపీని వీడి వెళ్లిపోయారు. అయితే వైసిపి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలియడంతోనే సీనియర్లంతా జట్టు కట్టి మరి పార్టీకి గుడ్ బై చెప్పారని ప్రచారం జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. వైసిపి పై నమ్మకంతో ఆ పార్టీలో చేరారు. కానీ ఆమె ఇప్పుడు భవిష్యత్తును వెతుక్కుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పార్టీని వీడారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, రామచంద్రయ్య, జంగా కృష్ణమూర్తి… ఇలా ఒక్కరా ఇద్దరా.. చాలామంది నాయకులు పార్టీకి దూరమయ్యారు.
నలుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ఉన్నా.. అనర్హత వేటు పడుతుందని తెలిసినా.. వారంతా వైసీపీకి గుడ్ బై చెప్పడం విశేషం. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఏమాత్రం విశ్వాసం ఉన్న వాళ్లంతా ఆచితూచి వ్యవహరించేవారు. జగన్ పార్టీ మరోసారి గెలిచే ఛాన్స్ లేదన్న పూర్తి అంచనాతోనే వారంతా పార్టీని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే తాజా ఎన్నికల్లో ఎక్కువగా నేతలు వీడుతున్న పార్టీ వైసిపి. అధికార పార్టీతో పోల్చుకుంటే విపక్షాల నుంచి చేరికలు అంతంత మాత్రమే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికలవేళ నాయకులు పార్టీ మారడం సహజమైన చర్యే. కానీ రాజకీయంగా ఒక వెలుగు వెలుగి.. పార్టీ అధికారంలోకి వస్తే పదవులు గ్యారెంటీ ఉన్న నాయకులు వైసీపీని వీడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వైసిపి ని మునిగిపోయే నావగా విపక్షాలు అభివర్ణిస్తుండగా.. తమది నేతల బలం కాదు.. ప్రజాబలం అంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. మరి ఎన్నికల్లో వైసీపీ గట్టెక్కుతుందా? లేకుంటే వైఫల్యాన్ని మూటగట్టుకుంటుందా? అన్నది చూడాలి.