Heat Waves: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదివారం రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఈరోజు సైతం అదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దాదాపు 95 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలను అప్రమత్తం చేసింది.కాగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 107 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
ఉదయం 7 గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 10 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి,నెల్లూరు జిల్లా కనిగిరిలో రికార్డు స్థాయిలో 45.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కడప జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలో 45.6, బాపట్ల జిల్లా జే పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బోట్ల గూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయినట్లు తెలుస్తోంది.అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మంచినీరు, మజ్జిగ, గ్లూకోజ్, ఓ ఆర్ ఎస్ తాగాలని సూచిస్తున్నారు.
విజయనగరం, శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుంది. అల్లూరి, బాపట్ల,ఏలూరు, గుంటూరు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాలో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అలెర్ట్ చేసింది. మరోవైపు ఒడిస్సా నుంచి చత్తీస్గడ్, విదర్భ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.