Tirumala : తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సంక్రాంతి సెలవులు కూడా కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తిరుమలలో ఈ నెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. రేపటితో అవి ముగియనున్నాయి. ఈ తరుణంలో వేలాది మంది భక్తులు తిరుపతి కొండపై కిటకిటలాడుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు రేపటితో ముగియనున్న నేపథ్యంలో సర్వదర్శనానికి సంబంధించిన టోకెన్ల కేటాయింపును రద్దు చేశారు. ముందుగా టోకెన్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. రేపటి వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఉంది. ఆదివారంతో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. ఈనెల 20న ముందస్తుగా ఎస్ఎస్సి టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రకటించారు.
* 20న విఐపి దర్శనాలు రద్దు
ఇప్పటికే ఈ నెల 20న వీఐపీ దర్శనాలను రద్దు చేసింది టిటిడి( Tirumala Tirupati Devasthanam). సర్వదర్శనాలకు సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నేరుగా క్యూ లైన్ ల లోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. కాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. స్లాటెడ్ సర్వదర్శనం కోసం భక్తులు ఐదు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక 300 టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. శుక్రవారం స్వామివారికి 19,736 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
* చేదు అనుభవం
అయితే ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలు టీటీడీకి( TTD ) చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 9న వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియలో అపశృతి జరిగింది. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది టీటీడీ చరిత్రలోనే తొలి విషాద ఘటన. దీంతో లక్షలాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వెనువెంటనే టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కొందరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరి కొందరు పై బదిలీ వేటు వేశారు.
* రేపటితో ఉత్తర ద్వార దర్శనాలు ముగింపు
రేపటితో తిరుమలలో( Tirumala) ఉత్తర ద్వారా దర్శనాలు పూర్తికానున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది. ఈవో తో పాటు అడిషనల్ ఈవో పై చర్యలకు దిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సీరియస్ అయ్యారు. టీటీడీ ట్రస్ట్ బోర్డుతో పాటు అధికారులు క్షమాపణ చెప్పాలని కోరారు. పవన్ సూచనల మేరకు టీటీడీ సభ్యులు మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి చెక్కులు అందించారు. ఈ తొమ్మిది రోజుల్లో దాదాపు 7 లక్షల మంది భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపటితో ఈ దర్శనాలు ముగియనుండడంతో టీడీపీ ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉంది.