Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan : ఇక ప్రస్తుతం ఏపీలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యం తేవడానికి.. మేము అనే భావన కలిగించడానికి ఆయన కాస్త కటువుగానే మాట్లాడారు. ” తెలంగాణ ప్రాంత ప్రజల్లో నా తెలంగాణ అనే భావన ఉంటుంది. కానీ అదే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ కులాల వారీగా విడిపోయింది. ఇక్కడ ఎవరి కులం వారికి ముద్దయిపోయింది. కానీ మేము ఆంధ్రులం అనే భావన ఎక్కడ వస్తుందంటే.. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో.. దాని విషయంలో మాత్రమే ఆంధ్రులు ఐక్యంగా ఉంటారు. మిగతా విషయాల్లో మాత్రం కులాలవారీగా విడిపోతారని.. ఎవరికి వారుగా ఉంటారని” పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసిపి నాయకులు మండిపడుతున్నారు. ” 2019లో జరిగిన ఎన్నికల్లో గాజువాక, భీమవరం ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. రెండు నియోజకవర్గాలలో పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో తన సామాజిక వర్గం బలంగా ఉండే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఒక మహిళపై గెలవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. తనకున్న సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. ఇప్పుడేమో తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రాన్ని నా తెలంగాణ అనుకుంటున్నారని.. ఆంధ్ర ప్రజలు మాత్రం కులాల వారీగా విడిపోయారని చెబుతున్నారు. కులాలవారీగా సమాజం విడిపోయినప్పుడు.. ఆ సమాజాన్ని ఏకం చేసే పనిని పవన్ కళ్యాణ్ చేయవచ్చు కదా. గతంలో ఆయన గాజువాక, భీమవరంలో పోటీ చేసినట్టుగా.. గడిచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా.. అలా కాకుండా తన సామాజిక వర్గం బలంగా ఉన్నచోట మాత్రమే పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ కులం విషయంలో ఒక్కో వేదిక మీద ఒక్కోతీరుగా మాట్లాడుతున్నారు. తనకు రాజకీయ బలం లభిస్తుందన్న చోట పవన్ కళ్యాణ్ ఒక విధంగా మాట్లాడుతారు. ఆ తర్వాత సూక్తులు వల్లిస్తారు. కులాలు మనదేశంలో కొత్తగా ఏర్పడలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కులాలు లేవు. అన్నిచోట్ల ఉన్నాయి. తనకు కులం అనే భావనలేదని పవన్ కళ్యాణ్ చెప్పగలరా” అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.. మరోవైపు కులాలు లేని సమాజాన్ని సృష్టించడమే పవన్ కళ్యాణ్ ఉద్దేశమని.. అందువల్లే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక కులాన్ని గురించి ఆలోచించేవాడు అయితే.. నేరుగా తన సామాజిక వర్గం ఆధారంగానే రాజకీయాలు చేసేవారని జనసేన నాయకులు చెబుతున్నారు.
తెలంగాణ వాళ్లకి ‘నా తెలంగాణ’ అనే భావం ఉంది
ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప, మేం ఆంధ్రులం అనే భావన లేదు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/UZl5DDadDA
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2025