YS Jagan Tirumala Tour : తిరుమలలో వివాదం పెను ప్రకంపనలకు కారణమవుతోంది. ఈ విషయంలో వైసీపీని కార్నర్ చేయడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. అందుకే ఇప్పుడు పోరాట బాటను పట్టింది.వైసీపీ అధినేత జగన్ తిరుమలను సందర్శించనున్నారు.ఇదంతా రాజకీయ పగతో చిత్రీకరించారని..చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వైసిపి ప్రకటించింది. అదే సమయంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టాలని వైసీపీ శ్రేణులకు సూచించింది.అయితే జగన్ తో పాటు భారీగా వైసీపీ శ్రేణులు తిరుమలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను అడ్డుకుంటామని బిజెపితో పాటు కూటమి పార్టీల శ్రేణులు చెప్పుకొచ్చాయి. హిందూ ధార్మిక సంఘాలు సైతం హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో జగన్ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హై టెన్షన్ వాతావరణం సైతం కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. జగన్ తిరుమల సందర్శన నేపథ్యంలో పవన్ సూచించిన అంశాలు బాగా వైరల్ అవుతున్నాయి. మూడు పార్టీల శ్రేణులు అలర్ట్ అవుతున్నాయి.
* ఈరోజు భక్తుల రద్దీ
లడ్డు వివాదం నేపథ్యంలో వైసిపి పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలను టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఖండించారు. అయినా సరే కూటమి పార్టీల నేతలు వైసీపీని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో జగన్ నేరుగా తిరుమలను సందర్శించనున్నారు. సాధారణంగా శనివారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం బిజీగా ఉంటుంది. రాష్ట్రంలోని ఆలయాలు సైతం భక్తుల రద్దీతో నిండుగా ఉంటాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక వ్యూహం ఉందని కూటమి పార్టీలు అంచనాకు వచ్చాయి. సాధారణ భక్తులు సైతం పూజల్లో పాల్గొనడాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడగా అనుమానిస్తున్నాయి.
* తెరపైకి డిక్లరేషన్
అయితే జగన్ ను ఎలాగైనా అడ్డుకోవాలని హిందూ ధర్మిక సంఘాలు డిసైడ్ అయ్యాయి. పెద్ద ఎత్తున తిరుమల చేరుకోవాలని పిలుపునిచ్చాయి. మరోవైపు జగన్ డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు కూటమి పార్టీల నేతలు. డిక్లరేషన్ ఇస్తేనేతిరుమలలో ప్రత్యేక పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని.. లేకుంటే అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు తిరుపతి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. లడ్డు వివాదం నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న దృష్ట్యా.. సభలు, సమావేశాలకు అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు. ఎవరైనా నిబంధనలకు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
* అడ్డుకోవద్దు
అయితే తిరుమల సందర్శనకు వస్తున్న జగన్ ను అడ్డుకుంటే కూటమి పార్టీలపై విమర్శలు చెలరేగే అవకాశం ఉంది. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమి పార్టీల శ్రేణులకు కీలక సూచనలు చేశారు. జగన్ పర్యటన పై మాట్లాడవద్దని.. అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ప్రత్యేక ప్రకటన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర సంస్థ అని.. దానిని నియంత్రించే ప్రయత్నం చేయవద్దని.. దేవాదాయ శాఖ నిబంధనల మేరకు డిక్లరేషన్ అంశాన్ని టిటిడి చూసుకుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ ను అడ్డుకుంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని.. డిప్యూటీ సీఎం పవన్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే జగన్ ను పవన్ లైన్ క్లియర్ చేసినట్లు అయింది.