Pawan Kalyan Controversial Comments: ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ.. పదేళ్ల క్రితంత వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఎవరి పాలన వారు సాగిస్తున్నారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండగా ఏపీలో మొదట టీడీపీ తర్వాత వైసీపీ మళ్లీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐక్యంగా పనిచేశాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పాలనలో ఉంది. ఐక్యంగా ఉంటాయనుకుంటే.. తరచూ సమస్యలు సృష్టించుకుంటున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
కోనసీమకు దిష్టి తాకిందని..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమపై తెలంగాణ ’దిష్టి’ పడిందని పేర్కొన్నారు. కోనసీమను చూసి తెలంగాణ వాళ్లు కుళ్లుకుంటున్నారని వ్యతిరేక దృష్టి పడుతోందని తెలిపారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఖండించి, పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతను పెంచుతోందని తెలిపారు. ఇలాంటి మాటలు చెప్పడం తప్పు, మా దృష్టి లేకపోతే పవన్ గెలిచేవారా’ అని ప్రశ్నించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
రాజకీయ ప్రభావం
ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సీమాంధ్ర, తెలంగాణ విభజన గుర్తులను మళ్లీ గుర్తుచేస్తోంది. కాంగ్రెస్ నాయకుల స్పందనలు పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇది జనసేన, కాంగ్రెస్ మధ్య తీవ్ర చర్చలకు దారితీసి, రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్ధృతం చేయవచ్చు. దీనిపై వెంటనే పవన్ స్పందించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ నేతలు కోరుతున్నారు.