Chaganti vs YSRCP: దేనినైనా తెగేదాకా లాగకూడదు. అలా లాగుతాం అనుకుంటే దాని పర్యవసానాలు గురించి ఆలోచన చేయాలి. ప్రతికూల ఫలితాలు వస్తాయంటే అక్కడితో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. పోనీ మైలేజ్ దక్కుతుందంటే మాత్రం కంటిన్యూ చేస్తే మంచిది. అయితే ఇప్పుడు ప్రవచనకర్త చాగంటి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. హిందూ సమాజంలో చాగంటి కోటేశ్వరరావుకు ప్రత్యేక స్థానం ఉంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. ఇటువంటి సమయంలో చంద్రబాబును పొగిడారని ఒకే ఒక కారణంతో చాగంటి కోటేశ్వరరావు టార్గెట్ చేసుకుంటే.. హిందూ సమాజంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మారిపోవడం ఖాయం. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నైతిక విలువల బోధన బాధ్యతలను తీసుకున్న చాగంటి కోటేశ్వరరావు కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. సమాజంలో విద్యార్థుల పాత్రతో పాటు తల్లిదండ్రుల విషయంలో ఎలా నడుచుకోవాలో వివరించారు. ఎక్కడో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పుకునే తనకు సీఎం చంద్రబాబు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పరితపించే నాయకుడు చంద్రబాబు అంటూ యధాలాపంగా చెప్పారు. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాగంటి కోటేశ్వరరావును టార్గెట్ చేసుకుంది.
పెద్దలకు చాలా ఇష్టం..
ఉదయం లేచింది మొదలు చాలామంది పెద్దవారు ఇప్పుడు టీవీల ముందు కూర్చుంటున్నారు. ముఖ్యంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు( Chaganti Koteswara Rao ) ప్రవచనాలు తెలుగు నాట పాపులర్ అయ్యాయి. ఎక్కువమంది పెద్దలు ఆయన ప్రవచనాలు వింటారు. చాలా సరళంగా, సూక్ష్మమైన పద్ధతుల్లో ప్రవచనాలు చెప్పడం చాగంటి కోటేశ్వరరావుకు ప్రత్యేకం. అందుకే ప్రభుత్వం ఆయనతో చర్చించి విద్యార్థులకు నైతిక విలువల బోధన బాధ్యతను అప్పగించింది. ఇందుకుగాను క్యాబినెట్ హోదా తో కూడిన సలహాదారు పదవి కూడా ఇచ్చింది. అయితే వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించిన చాగంటి పిల్లలకు నైతిక విలువలు బోధించే బాధ్యతను మాత్రం తీసుకున్నారు. కానీ అంతకుముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే చాగంటి కోటేశ్వరరావును ఆశ్రయించింది. అప్పట్లో కూడా ప్రభుత్వం తరఫున కొన్ని కీలక సూచనలు చేసింది. అయితే అప్పట్లో ఉన్న ప్రత్యేక కారణాలతో చాగంటి ఒప్పుకోలేదు. టిడిపి ప్రభుత్వంతో పాటు చంద్రబాబు బాధ్యతతో అడిగేసరికి కాదనలేకపోయారు చాగంటి.
అది ప్రవచనంలో భాగం..
సాధారణంగా నైతిక విలువలు అంటే కుటుంబాలు, ఆపై మనిషి జీవితంలో ఉన్న పరిస్థితుల్లో మంచి ఏదో.. చెడు ఏదో చెప్పడం ప్రవచనం ముఖ్య ఉద్దేశ్యం. మనిషి జీవనశైలిని ఇలా ఉండాలని చెబుతూ కొన్ని ఆధ్యాత్మిక ఉదాహరణలు చెప్పడం అనేది ప్రవచనంలో పరిపాటి. అదే విషయంపై చెప్పారు చాగంటి. తల్లిదండ్రుల విషయంలో ఎవరైతే శ్రద్ధగా ఉంటారో.. వారి బాగోగులు చూసుకుంటారో.. అట్టి వారి జీవనం బాగుంటుందని చెప్పారు చాగంటి. అదే సమయంలో అక్కడ ఉన్నారు మంత్రి నారా లోకేష్. ఆ మరుక్షణం మంచి కొడుకుగా లోకేష్.. చెడ్డ కొడుకుగా జగన్ చాగంటి కోటేశ్వరరావు అన్నట్టు ఊహించుకున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అందుకు తగ్గట్టుగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా భావించే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అది మొదలు చాగంటి కి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. అయితే హిందూ సమాజంతో పాటు ప్రవచనకర్త చాగంటి ప్రవచనాలను అభిమానించేవారు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం ప్రారంభించారు. అయితే ఇంత దుమారం రేగిన తర్వాత కూడా చాగంటి విషయంలో రచ్చ ఆగకపోతే అంతిమంగా అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే నష్టం.