https://oktelugu.com/

AP Politics : ఏపీలో ఆగని విధ్వంసం..వైసీపీకి ఓటేశారని మాజీ సైనికుడు ఇంటి కూల్చివేత.. వీడియో వైరల్!

రాష్ట్రంలో రాజకీయ విధ్వంస ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్ష వైసిపి శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై జగన్ ఢిల్లీ వేదికగా పోరాటం చేశారు. సరిగ్గా ఇదే సమయంలోనే విజయనగరంలో ఓ మాజీ సైనికుడి ఇంటిని అధికారులు కూల్చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

Written By:
  • Dharma
  • , Updated On : July 27, 2024 / 06:31 PM IST
    Follow us on

    AP Politics  : రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఆరోపిస్తున్న వేళ.. ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఓ మాజీ సైనికుడి ఇంటిని ఆక్రమణల పేరిట కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో దాదాపు 1000 విధ్వంస ఘటనలు జరిగాయని వైసిపి ఆరోపిస్తోంది. జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా కూడా చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. జాతీయస్థాయి నాయకులు హాజరయ్యారు. ఏపీలో విధ్వంస ఘటనలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చూసిన జాతీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు సర్కార్కు కొనసాగే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఏపీలో ఇంత విధ్వంసం జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ శాసనసభలో వైసీపీ సర్కార్ వైఫల్యాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు ఎండగడుతున్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ఈ విధ్వంసాలపై మాట్లాడాలని సవాల్ చేశారు. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన ఘటనలపై ఫోటో ప్రదర్శన చేస్తే ఢిల్లీ వీధులు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. ఒకవైపు ఏపీలో శాంతిభద్రతలపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్న వేళ.. ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక మాజీ సైనికుడు ఇంటిని తొలగించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆక్రమణల పేరిట రాజకీయ వివక్షతోనే ఈ ఘటన జరిగిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. కేవలం కూటమికి ఓటు వేయలేదన్న కోపంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పుకొస్తున్నాడు. నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన లోకం మాధవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయలేదన్న కోపంతోనే.. ఆక్రమణల పేరిట తన ఇంటిని తొలగించారని మాజీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వైసీపీ శ్రేణులు దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి.

    * యంత్రాలతో మొహరింపు
    పోలీసులతోపాటు సంబంధిత శాఖ అధికారులు యంత్రాలు, వాహనాలతో మొహరించారు. మాజీ సైనికుడితోపాటు ఆయన సోదరుడు ఇంటిని తొలగించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అడ్డు తగిలిన పోలీసులు పక్కన పడేశారు. గత 24 సంవత్సరాలుగా భారత సైన్యంలో సేవలందించానని.. తనలాంటి వారి విషయంలో రాజకీయాలు చేయడం తగునా అంటూ బాధితుడు ప్రశ్నించాడు. నేరుగా సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కు వార్నింగ్ ఇవ్వడం విశేషం.

    * నోటీసులు ఇచ్చామని చెబుతున్న అధికారులు
    అయితే అక్కడ ఉన్న అధికారులు మాత్రం ఆ ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని చెబుతున్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఫలితం లేకపోయిందని.. అందుకే తొలగించాల్సి వచ్చిందంటున్నారు. బాధితులు మాత్రం దీని వెనుక రాజకీయ ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తున్నారు. కేవలం వైసీపీకి ఓటు వేశామన్న బాధతోనే తమ ఇంటిని తొలగించారని చెప్పుకొస్తున్నారు. ఇందులో స్థానికుల ప్రమేయం ఉందని చెబుతున్నారు. స్థానికంగా జనసేన ఎమ్మెల్యే ఉండడంతో తమకు పవన్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    * రాజకీయ రంగు
    అయితే ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. దీనిపై జిల్లా వైసిపి నాయకత్వం సైతం స్పందించింది. అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లింది.వైసిపి రాష్ట్ర నేతలు దీనిపై స్పందించినట్లు తెలుస్తోంది.నేరుగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు సమాచారం.