Cyclone Montha Shocking Video: ఏపీలో( Andhra Pradesh) తుఫాను ప్రభావం ప్రారంభం అయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి వర్షం ప్రారంభం అయింది. మధ్యాహ్నం కి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారింది. రేపు ఉదయానికి తీవ్ర వాయుగుండం గా మారే అవకాశం ఉంది. రేపు రాత్రికి తీరం దాటనుంది. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరం వైపు దూసుకొస్తుంది. మరోవైపు తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ప్రచండ గాలుల హెచ్చరిక..
అప్పుడే తీరం వెంబడి భారీగా ఈదురు గాలులు వీస్తుండడంతో.. రేపు ప్రచండ గాలులు తప్పవని తేలిపోయింది. విశాఖ నగరంలో( Vishakha Nagaram ) భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా తీరం అల్లకల్లోలంగా మారింది. దీంతో ఆర్కే బీచ్, కైలాసగిరి, రుషికొండ ప్రాంతాల్లో పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు. ఈదురు గాలులకు నగరంలో చాలాచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఇంకోవైపు అనకాపల్లి జిల్లాలోని జలాశయాల వద్ద అధికారులు ప్రకటించారు. తాండవ, రైవాడ, కోనాం, పెద్దేరు ప్రాజెక్టుల వద్ద అధికారులు పహారా కాస్తున్నారు. మరోవైపు తీర ప్రాంతంలో అలజడి ప్రారంభం అయింది. అలలు ఎగిసిపడుతున్నాయి.
అంతటా వర్షాలు..
శ్రీకాకుళం ( Srikakulam )నుంచి నెల్లూరు వరకు వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణాజిల్లా గన్నవరం ప్రాంతంలో భారీ వర్షం నమోదు అయింది. గత అనుభవాల దృష్ట్యా బుడమేరుపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. సోమవారం మధ్యాహ్నం కే కొన్ని ప్రాంతాల్లో కుండ పోత వర్షం పడింది. అయితే మంగళవారం నుంచి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ సోమవారం ఉదయానికే పరిస్థితి విషమించినట్లు కనిపిస్తోంది. ప్రచండ గాలులు వీస్తాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం పడుతుందని హెచ్చరికలు నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించే వీలుగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు అత్యవసర సహాయ సేవల కోసం ప్రభుత్వం ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. అవసరం అనుకుంటే డ్రోన్ల సేవలను సైతం వినియోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. మరోవైపు సహాయక చర్యల కోసం తుఫాన్ ప్రభావిత జిల్లాలకు కోటి రూపాయలు చొప్పున కేటాయించారు. మరికొన్ని జిల్లాలకు 50 లక్షల రూపాయల చొప్పున కేటాయించింది కూటమి ప్రభుత్వం. అయితే తుఫాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నా.. పరిస్థితులు చూస్తుంటే మాత్రం తీవ్రంగా ఉన్నాయి.
ఏపీలోని పలు జిల్లాల్లో ప్రారంభమైన మొంథా తుఫాన్ ప్రభావం
కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.
గన్నవరం, హనుమాన్ జంక్షన్లో కురుస్తున్న వాన.
ఇటు నెల్లూరులోనూ పలు ఏరియాల్లో వర్షం స్టార్ట్.
కృష్ణపట్నం సముద్రతీర ప్రాంతాల్లో ఎగసిపడుతున్న అలలు. pic.twitter.com/u03JCUpRs0— ChotaNews App (@ChotaNewsApp) October 27, 2025