Land acquisition: అమరావతి రాజధానికి( Amaravathi capital ) సర్వం త్యాగం చేశారు అక్కడి రైతులు. వారి విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వారి త్యాగాలకు విలువ ఇవ్వాలని భావిస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కూటమి అధికారంలోకి రావడంతో తమ ఇబ్బందులు తీరుతాయని భావించారు. మరోవైపు అమరావతికి అదనంగా భూములు అవసరం అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆ భూములను సమీకరించాలా? సేకరించాలా? అన్న ప్రయత్నంలో భాగంగా ఇబ్బందికర పరిస్థితులు తెరపైకి వచ్చాయి. ఇటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు అదనపు భూములకు సంబంధించిన నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టారు. అయితే గత ఐదేళ్ల పరిణామాలతో అమరావతి రైతుల్లో ఒక రకమైన ఆందోళన ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో సి ఆర్ డి ఏ సరిగ్గా వ్యవహరించాలి. కానీ గతం కంటే భిన్నంగా సీఆర్పీఏ వ్యవహార శైలి ఉన్నట్లు ఒక ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది.
ప్రత్యామ్నాయ స్థలం చూపరట
అమరావతి రాజధానిలో రాయపూడి( rayapudi) ప్రాంతం కూడా కీలకం. అటువంటి గ్రామంలో ఓ నిరుపేద వృద్ధురాలు సిఆర్డిఏ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2014 కంటే అంటే రాష్ట్ర విభజనకు ముందు ఆ వృద్ధురాలికి రాయిపూడి గ్రామంలో ఎకరా 50 సెంట్లు భూమి ఉంది. అయితే అప్పట్లో ఓ కాలనీ నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం ఎకరా 45 సెంట్లు ఆమె వద్ద తీసుకుంది. ఇంకా ఆమెకు ఐదు సెంట్లు మాత్రమే మిగిలింది. భర్త చనిపోవడంతో కుమార్తె, మనుమరాలితో ఆమె నివాసం ఉంటుంది. కుమార్తె దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తురాలు. మనవరాలు మానసిక వికలాంగురాలు. ఈ తరుణంలో ఆమె ఐదు సెంట్లు స్థలంలో ఉన్న ఇంటిని ఖాళీ చేయమని సిఆర్డిఏ అధికారులు ఆదేశిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయంగా ఎక్కడ స్థలం చూపించడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తుంటే సిఆర్డిఏ నిబంధనలకు అనుగుణంగా ఐదు సెంట్లు భూమికి బదులు స్థలం ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. అది గ్రామకంఠం కాదని.. వ్యవసాయ భూమి అని చెబుతూ ఇవ్వలేమని తేల్చేస్తున్నారు. దీంతో ఆ వృద్ధురాలు పడుతున్న బాధ వర్ణనాతీతం.
అప్పటి బాధ్యత ఏది?
2014లో అమరావతి రాజధాని భూ సేకరణ సమయంలో సి ఆర్ డి ఏ( crda) అధికారులు చాలా బాధ్యతగా వ్యవహరించేవారు. అటు ప్రభుత్వానికి, ఇటు రైతులకు అనుసంధానంగా ఉండేవారు. ఎప్పటికప్పుడు రైతుల సమస్యలకు పరిష్కార మార్గం చూపేవారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. కనీసం ఇప్పుడు ఆ వృద్ధురాలికి ఎదురైన సమస్యను పరిష్కరించకపోగా.. ఇంటిని ఖాళీ చేయమని బలవంతం పెడుతున్నారు. సిఆర్డిఏ అధికారుల్లో వచ్చిన ఈ మార్పును గమనించి అమరావతి రైతులు అదనపు భూ సేకరణకు ఇష్టపడడం లేదు. అయితే సి ఆర్ డి ఏ లో వచ్చిన ఈ వైఖరి కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చిపెడుతోంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే సి ఆర్ డి ఏ ద్వారా అమరావతికి ఇబ్బందికరమే. ఇక మేల్కొనాల్సింది ప్రభుత్వమే.