YS Sharmila: కడపలో క్రాస్ ఓటింగ్.. షర్మిల గట్టెక్కుతారా?

ఒకవైపు షర్మిల రాజకీయ పోరాటం చేస్తుంటే.. మరోవైపు సునీత న్యాయ పోరాటం చేస్తూ ముందుకు సాగారు. షర్మిలకు అండగా సునీతతో పాటు ఆమె తల్లి సౌభాగ్యమ్మ ప్రచారం చేశారు. జగన్ తల్లి విజయమ్మ షర్మిల కు మద్దతుగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

Written By: Dharma, Updated On : May 15, 2024 4:50 pm

YS Sharmila

Follow us on

YS Sharmila: ఏపీలో అత్యంత ఉత్కంఠం రేపిన నియోజకవర్గం కడప పార్లమెంట్ స్థానం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల పోటీ చేశారు. వివేక హత్య కేసును హైలైట్ చేస్తూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అవినాష్ రెడ్డి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో.. షర్మిల నేరుగా రంగంలోకి దిగారు. అవినాష్ ను ఎలాగైనా ఓడించాలన్న కసితో పని చేశారు. అయితే జగన్ దెబ్బతీయాలని అటు చంద్రబాబు భావిస్తున్న తరుణంలో.. షర్మిల అన్న పై యుద్ధం ప్రకటించడంతో విపక్షాల నుంచి ఆమెకు ఆయాచిత లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది.

ఒకవైపు షర్మిల రాజకీయ పోరాటం చేస్తుంటే.. మరోవైపు సునీత న్యాయ పోరాటం చేస్తూ ముందుకు సాగారు. షర్మిలకు అండగా సునీతతో పాటు ఆమె తల్లి సౌభాగ్యమ్మ ప్రచారం చేశారు. జగన్ తల్లి విజయమ్మ షర్మిల కు మద్దతుగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. షర్మిల కు మద్దతు తెలపాలని కడప జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో షర్మిల కడప జిల్లాలో చేసిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైయస్ బిడ్డగా అడుగుతున్నా న్యాయం చేయండి.. కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండి అంటూ షర్మిల అడిగేసరికి కడప జిల్లా ప్రజల్లో ఒక రకమైన చేంజ్ కనిపించింది. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అటు జగన్ పై అభిమానం ఉన్నవారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేస్తే.. ఎంపీ విషయానికి వచ్చేసరికి షర్మిలకు ఓటు వేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ సరళి కూడా దానినే తెలియజేస్తోంది.

ఇక్కడ టిడిపి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ టిడిపికి నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ జగన్ ను దెబ్బతీయాలంటే షర్మిలకు సపోర్ట్ చేయడమే మేలన్న నిర్ణయానికి టిడిపి వచ్చినట్లు సమాచారం. ఎంపీ కి మాత్రం షర్మిలకు వేసి, ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి మాత్రం కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని టిడిపి నాయకత్వం అంతర్గతంగా క్యాడర్కు మార్గదర్శకం చేసినట్లు సమాచారం.వైసీపీలో చీలిక వచ్చి, టిడిపి ఓటు బ్యాంకు తోడైతే.. షర్మిల కచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.