Election Commission: ఏపీలో హింసపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ తర్వాత కూడా హింస చలరేగడంపై సీరియస్ అయింది. గత మూడు రోజులుగా చోటు చేసుకున్న ఘటనలపై ఈసీ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సిఎస్ జవహర్ రెడ్డి తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ జరిగింది. చాలా చోట్ల హింస చెలరేగింది. తరువాత రోజు కూడా అది కొనసాగింది.
ముఖ్యంగా మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు. హింసకు కారణం అవుతున్న నేతలను హౌస్ అరెస్టులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయినా సరే హింస తగ్గడం లేదు.వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఈసీ సీరియస్ గా ఉంది. ఢిల్లీ వచ్చి వీటిపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సిఎస్, డిజిపి లకు సమన్లు ఇచ్చింది. ఢిల్లీ వెళ్లి సిఎస్, డీజీపీలు ఇందుకు గల కారణాలను వివరించనున్నారు.
అయితే ఆది నుంచి సిఎస్ జవహర్ రెడ్డి విషయంలో విపక్షం నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. కానీ ఈసీ ఎందుకో చర్యలు తీసుకోలేదు. డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పై మాత్రం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. కానీ ఎన్నికల్లో హింస తలెత్తకుండా చేయడంలో పోలీస్ శాఖ విఫలమైంది. పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లలో కూడా లోపాలు వెలుగు చూశాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వపరంగా ఎన్నికల కమిషన్ కు సహకరించలేదన్న ఆరోపణ కూడా ఉంది. దీనిపై కూడా ఎన్నికల కమిషన్ సిఎస్ ను వివరణ కోరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు చేరుకుంటున్నట్లు సమాచారం. అల్లర్ల దృష్ట్యా ఆ ప్రాంతాల్లో మూడు రోజులపాటు బంద్, కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.