Corruption allegations in Jagan camp: రాజకీయాల్లో వారసత్వం ఎక్కువగా కనిపిస్తోంది. మిగతా రంగాలకు భిన్నంగా ఉంటోంది. అటు తరువాత సినిమా రంగంలో కూడా వారసత్వం అనేది ఉంది. అయితే క్రీడారంగానికి వచ్చేసరికి మాత్రం అది కనిపించదు. అయితే ముఖ్యంగా రాజకీయ వారసత్వం అనేది చాలా సులువు. ఎందుకంటే తండ్రి వారసత్వాన్ని చాలా సులువుగా అందుకోవచ్చు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో పాటు తాను ఎదగాలన్న కోణంలో ఎక్కువమంది ఆలోచిస్తారు. అలానే రాజకీయాల్లోకి వస్తారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తూ వస్తూ చాలామంది అవినీతి మరక అంటించుకుంటున్నారు. రాజకీయాల్లో దూకుడు తనంతో చేజేతులా.. ఆదిలోనే తప్పటడుగులు వేస్తున్నారు. అయితే ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) దూకుడుకు చాలామంది యువ నేతలు ఇబ్బంది పడుతున్నారు.
సీనియర్ నేతల వారసులు మాత్రం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. ఉత్తరాంధ్ర( North Andhra ) నుంచి మొదలుపెడితే ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాసు, తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్.. ఇలా చాలామంది నేతలు ఉన్నారు. వారికి వారసులు సైతం ఉన్నారు. అయితే వారి రాజకీయ భవిష్యత్తు విషయంలో మాత్రం చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు సదరు నేతలు. వివాదాస్పద ముద్ర లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. సరైన సమయం చూసి రాజకీయాల్లోకి వదలాలని చూస్తున్నారు.
అలా తప్పటడుగులు
అయితే వైసీపీలో ఉండి.. జగన్( Y S Jagan Mohan Reddy) సామాజిక వర్గానికి చెందిన నేతలు తమ వారసుల విషయంలో తప్పటడుగులు వేశారు. దీంతో వారంతా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వారిపై అవినీతి మరక పడుతోంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. మూడుసార్లు ఎంపీగా ఉన్న ఆయన మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం అరెస్టయ్యారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది. ఇక మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డికి సైతం మద్యం కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్లు సిట్ తేల్చింది. అంటే వీరంతా రాజకీయ ప్రారంభ దశలో ఉండగానే అవినీతి మరక అంటించుకున్నారన్నమాట.
తండ్రుల దూకుడుతో..
ఇంకోవైపు పేర్ని నాని( perni Nani ) కుమారుడు పేర్ని కిట్టు సైతం అవినీతి మరక అంటించుకున్నారు. తండ్రి భరోసా వుండడంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తద్వారా కిట్టు పై రౌడీషీట్ కూడా ఓపెన్ అయింది. ఇది ముమ్మాటికి ఆయన రాజకీయ జీవితానికి ప్రతిబంధకమే. మొన్నటి ఎన్నికల్లో కిట్టు వైసిపి అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇంకోవైపు మాజీమంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ సైతం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్టయ్యారు. ఆయనపై సైతం అవినీతి మరక అంటింది. ఇలా వైసిపి యువనేతల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. అయితే ఇక్కడే ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వైసీపీలో సీనియర్లుగా ఉన్న వారి వారసులు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. దూకుడు కలిగిన నేతలు, జగన్ సన్నిహిత నాయకుల వారసులు మాత్రం అవినీతి మరక అంటించుకున్నారు.