YCP Leaders: వైసిపి నేతలపై రోజుకో బాంబు పేలుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కో వైసీపీ నేతపై బలమైన ఆరోపణలు వస్తున్నాయి. వ్యక్తిగత, వివాహేతర సంబంధాలు, అసభ్య ప్రవర్తనలు.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల వివాదాల్లో ఆ పార్టీ నేతలు చిక్కుకుంటున్నారు. తొలుత విజయసాయి రెడ్డి పేరు బలంగా వినిపించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త విజయసాయి రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అంటూ ఆరోపించారు. అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధం కావాలని సవాల్ చేశారు. అయితే ఇదంతా మీడియా కుట్రేనంటూ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసి బయటకు వెళ్లిపోయారు. ఆ వివాదం సద్దుమణిగిందనగా.. ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ బయటకు వచ్చింది. గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. తొలుత అంతా ఫ్యామిలీ వివాదం అనుకున్నారు. కానీ మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురి పేరు బయటకు వచ్చింది. ఆవిడ సైతం మీడియాకు ఇంటర్వ్యూలు, దువ్వాడ శ్రీనివాస్ తో తనకున్న అనుబంధం.. ఇలా అన్నింటినీ బయటపెట్టేశారు. మీడియాకు పక్షం రోజులు ఇదో హాట్ టాపిక్ అయ్యింది. మీడియా మొత్తం ఈ అంశం చుట్టూనే తిరిగింది. ఇదిలా ఉండగానే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం బయటకు వచ్చింది. ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు అనంతబాబు. అది వీడియోలో స్పష్టంగా రికార్డు అయి ఉంది. దీంతో సరికొత్త వైరల్ అంశంగా ఇది మారింది. మీడియాకు ప్రధాన అంశంగా మారిపోయింది.
* అధికారంలో ఉన్నప్పుడే
వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కొంతమంది నేతల వ్యవహార శైలి అడ్డగోలుగా ఉండేది. ముఖ్యంగా నాటి మంత్రులు అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ఎంపీ గోరంట్ల మాధవ్.. వంటి నేతల వ్యవహార శైలి అప్పట్లో బయటపడింది. అయినా ఒక్క నేతపై కూడా వైసిపి చర్యలకు ఉపక్రమించలేదు. చివరకు గోరంట్ల మాధవ్ లాంటి వారిని పార్టీ వెనుకేసుకొచ్చింది. ఆయనకు అండగా నిలబడింది. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఆడియోలు బయటకు వచ్చాయి. అయితే అదంతా మీడియా సృష్టి అని.. గిట్టని వారు చేసిన పని అని లైట్ తీసుకున్నారు. వారిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు.
* ప్రతిపక్షంలో ఇలా
అధికారంలో ఉన్నప్పుడే లేదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం పట్టించుకుంటాంలే అన్నట్టు ఉంది వారి వ్యవహార శైలి. ఇంకా చాలామంది రాసలీలలు బయటకు వస్తాయని ప్రచారం సాగుతోంది. మొన్న ఆ మధ్యన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు జనసేన నేత బొలిశెట్టి. ఒక ఎస్సీ మహిళను దారుణంగా వంచించారని.. ఆమెకు పుట్టిన బిడ్డకు ద్వారంపూడి దగ్గరుండి తలనీలాలు తీయించారని సంచలన ఆరోపణలు చేశారు. ఏడాదికాలంగా బాధిత మహిళను ఇంట్లో పెట్టి బంధించాలని.. బయటకు వస్తే కార్లలో నిఘా పెట్టారని చెప్పుకొచ్చారు. అయితే వీరే కాదు చాలామంది నేతల బాగోతాలు ఇంకా బయటపడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
* ఆ సమయంలో నివృత్తి చేస్తారని
వాస్తవానికి విజయసాయి రెడ్డి పై ఆరోపణలు వచ్చినప్పుడు నివృత్తి చేస్తారని అంతా భావించారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ భర్త డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధమా అని ప్రశ్నించేసరికి.. విజయసాయిరెడ్డి కనిపించకుండా మానేశారు. అటు తర్వాత దువ్వాడ, ఇప్పుడు అనంతబాబు వ్యవహార శైలి బయటపడింది. అయితే ఈ నేతలంతా వివాదాస్పదులే కావడం గమనార్హం. అందుకే వీరిపై చర్యలకు ఉపక్రమిస్తే ఒకటికి.. రెండు తోడవుతాయని హైకమాండ్ భయపడినట్లు సమాచారం. మొత్తానికైతే ఇలా ఆరోపణలు వస్తున్న వారిని వైసిపి భరిస్తుండడం విశేషం.