Tadepalli : సీఎం జగన్ కే ఎదురెళ్లిన హెడ్ కానిస్టేబుల్.. ఏమైందంటే?

అయితే ఒక్కసారిగా ఈ ఘటనతో తాడేపల్లిలో కలకలం చోటుచేసుకుంది. పోలీస్ యూనిఫారంలో భాగ్యరాజు ఈ ప్రయత్నం చేయడంతో పోలీస్ శాఖలో ఆందోళనకు కారణమైంది.

Written By: Dharma, Updated On : May 24, 2023 6:01 pm
Follow us on

Tadepalli : ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ ను ఓ హెడ్ కానిస్టేబుల్ అడ్డగించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన తాడేపల్లి సమీపంలో జరిగింది. మంగళవారం గుంటూరు పర్యటనకు సీఎం జగన్ వెళ్లారు. అక్కడ పర్యటన ముగించుకొని హెలికాప్టర్ లో తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. ఈ క్రమంలో హెలిప్యాడ్ నుంచి సీఎం జగన్ తన వాహన శ్రేణితో బయలుదేరారు. సెడన్ గా ఓ హెడ్ కానిస్టేబుల్ జగన్ వాహనాన్ని అడ్డగించే ప్రయత్నం చేశాడు. దీంతో భద్రతా బలగాలు ఒక్కసారిగా అలెర్టయ్యాయి. సంబంధిత హెడ్ కానిస్టేబుల్ ను పక్కకకు తోశాయి. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాయి.

విశాఖకు చెందిన ఏపీఎస్పీ బీ బెటాలియన్ గార్డ్ 1 కమాండర్ గా పెద్దిరెడ్డి భాగ్యరాజు విధులు నిర్వహిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ హోదాలో గత కొద్దిరోజులుగా విశాఖలో పనిచేస్తున్నారు. ఆయన భార్య విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ ఒకేచోట పనిచేసేందుకు వీలుగా బదిలీల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ కొలిక్కి రావడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విసిగివేశారిన భాగ్యరాజు సీఎం జగన్ ను కలిసేందుకు నిర్ణయించుకున్నాడు. నేరుగా కాన్వాయ్ నే అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

అయితే ఒక్కసారిగా ఈ ఘటనతో తాడేపల్లిలో కలకలం చోటుచేసుకుంది. పోలీస్ యూనిఫారంలో భాగ్యరాజు ఈ ప్రయత్నం చేయడంతో పోలీస్ శాఖలో ఆందోళనకు కారణమైంది. అటు పోలీస్ అధికారుల తీరు చర్చనీయాంశమైంది. అయితే సీఎం భద్రతా విభాగాలు మాత్రం ఇష్యూను సీరియస్ గా తీసుకున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. మరోసారి ఇటువంటి ఘటనలు జరుగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఏపీ పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశాయి.