Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ పై ( Mohan Babu University) చర్యలు వెనుక ఉన్నది ఎవరు? రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎందుకు సిఫార్సు చేసింది? దీని వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట మోహన్ బాబు యూనివర్సిటీ పై రాష్ట్ర ఉన్నత విద్య మండలి చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పందించింది. అధికంగా వసూలు చేసిన ఫీజులను వెనక్కి తీసుకోవడమే కాకుండా.. 15 లక్షల రూపాయల వరకు జరిమానా విధించింది. అయితే ఈ పరిణామాల వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఆయన వెనుక ఉండి ఇలా నడిపించారన్న టాక్ వస్తోంది.
* అప్పట్లో అలా..
మంచు మోహన్ బాబు సినీ నటుడే కాకుండా రాజకీయాల్లో సైతం రాణించారు. తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) సుదీర్ఘకాలం కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. అయితే చంద్రబాబును వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచేందుకు మోహన్ బాబు ప్రయత్నించారన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తన శ్రీవిద్యా నికేతన్ విద్యార్థులతో ఆందోళనలు జరిపించి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచారన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. అటు తర్వాత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. ఏకంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.
* వైసిపి తో పాటు బిజెపి సహకారం..
అయితే వైసిపి ( YSR Congress party)గెలుపుతో మోహన్ బాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతుందని అంతా భావించారు. అన్నింటికీ మించి నామినేటెడ్ పదవి ఇస్తారని తెగ హడావిడి నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. క్రమేపి మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్లు సంకేతాలు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఏకంగా చంద్రబాబును కలిశారు. లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని కోరారు. అయితే అందరూ రాజకీయంగా మోహన్ బాబు ఎటువంటి ప్రయోజనం పొందలేదని అప్పట్లో భావించారు. కానీ శ్రీవిద్యా నికేతన్ కాస్త మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది. అయితే యూనివర్సిటీ అనుమతుల వెనుక వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కేంద్రం సహకరించినట్లు తెలుస్తోంది. కానీ మోహన్ బాబు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మేలు మరిచిపోయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
* వివాదాలు పరిష్కరించుకున్న వైనం..
అయితే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ పై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చర్యలకు దిగడంతో.. దీని వెనుక లోకేష్ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పట్లో మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం లోకేష్ కు నచ్చలేదని.. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని సహించుకోలేకపోయారని.. అందుకే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా పావులు కదిపారు అన్నది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీ ట్రాప్ లో పడి మోహన్ బాబు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విధించిన జరిమానాను ఇప్పటికే చెల్లించేసారని.. విద్యార్థుల తల్లిదండ్రులతో వచ్చిన వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే వైసీపీ ప్లాన్ వర్కౌట్ కాలేదు.