Vijayasai Reddy: విజయసాయి రెడ్డి( Vijaya Sai Reddy) అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. కానీ ఇప్పుడు వ్యవసాయం అన్నది లేదు కానీ రాజకీయాలు మొదలు పెట్టేసారు. రాజకీయ సలహాలు ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఒక కీలక సూచన చేశారు. బలవంతపు మతమార్పిడులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ ఏ మతం నుంచి ఏ మతం మార్పిడి జరిగిందన్నది మాత్రం చెప్పడం లేదు. కచ్చితంగా మాత్రం ఆయన అభిప్రాయం హిందూ మతం నుంచి క్రిస్టియన్లలోకి మతమార్పిడి చేయడమే. సహజంగానే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మతమార్పిడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి నుంచి ఈ అంశాలు బయటకు వచ్చేసరికి మరోసారి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ చేసినట్టు అయింది.
* మద్యం కుంభకోణంలో అలా..
రాజకీయాలనుంచి తప్పుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి ఓ కేసు విచారణకు హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే క్రమంలో మద్యం కుంభకోణం గురించి మాట్లాడారు. చాలా రకాల సిట్టింగ్లలో తాను సైతం ఉన్నానని.. కానీ తనకు మాత్రం మద్యం కుంభకోణంతో( liquor scam ) సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆయనలా బయట మాట్లాడిన తర్వాత మద్యం కుంభకోణంలో వరుసగా అరెస్టులు ప్రారంభం అయ్యాయి. ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డి సైతం విజయసాయిరెడ్డి పై అసహనం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసు పై మాట్లాడే క్రమంలో విజయసాయిరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
* అప్పట్లో అనేక ఆరోపణలు..
అయితే ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి మతమార్పిడి ఆరోపణలు చేయడం పెను దుమారానికి దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మతమార్పిడులు ఎక్కువగా జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పట్లో కొంతమంది ఎమ్మెల్యేలు సైతం బలవంతపు మతమార్పిడులను ప్రోత్సహించారన్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. 2019 ఎన్నికల్లో క్రిస్టియన్లంతా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇదే విషయాన్ని జగన్ బావ, షర్మిల భర్త అనిల్ కుమార్ సైతం పరోక్షంగా ప్రస్తావించారు. అప్పట్లో చర్చిల్లో జగన్కు ఓటేస్తామని ప్రమాణం కూడా చేయించారని ఆరోపణలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి సైతం స్వతహాగా క్రిస్టియన్ కావడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది. అయితే మతం అనేది సున్నితమైన అంశము. ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఇప్పుడు బలవంతపు మతమార్పిడి ఎవరు చేశారు అన్నది విజయసాయి రెడ్డికి తెలుసు. ఆపై ఆయన ఆరోపణలు చేశారంటే కచ్చితంగా అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి అయి ఉంటుంది. అయితే మున్ముందు ఈ మతమార్పిడిల వ్యవహారం అనేది వివాదంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ రాజకీయాలు మతాలతో పాటు సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి మాటలు చూస్తుంటే ఈ అంశం చుట్టూ రాజకీయాలు మరింత అల్లుకునే అవకాశం ఉంది.