Mudragada Vs Pawan : జనసేన అధినేత పవన్ ను కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ టార్గెట్ చేశారు. ఇటీవల పవన్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తూ ముద్రగడ రాసిన లేఖ కలకలం సృష్టించింది. దీనిపై జన సైనికులు, కాపులు, కాపు సంఘాల నేతలు తీవ్రస్థాయిలో రియాక్టయ్యారు.ముద్రగడ చర్యలను తప్పుపట్టారు. ముప్పేట దాడిచేశారు. అయినా ముద్రగడ వెనక్కి తగ్గడం లేదు. ఈ రోజు పవన్ పై మరో లేఖాస్త్రం సంధించారు. 1988 వంగవీటి రంగా హత్య నుంచి మొన్నటి తుని విధ్వంసం వరకూ పలు అంశాలను ప్రస్తావిస్తూ రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. మరోసారి వివాదాస్పదం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
తాను ఎప్పుడూ పవన్ గురించి పత్రికల్లో స్టేట్ మెంట్లు ఇవ్వకపోవడాన్ని ముద్రగడ గుర్తుచేశారు. వారాహి యాత్రలో కాకినాడ ఎమ్మెల్యేతో పాటు తనను దూషించడం తప్పో ఒప్పో గ్రహించాలని హితవుపలికారు. తనను తిట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. తన లేఖపై మీరు స్పందించకుండా అభిమానులను పురమాయించారని ఆరోపించారు. మీ అభిమానులు బండబూతులతో మెసేజులు పెడుతున్నారని.. కానీ అటువంటి వాటికి భయపడనన్నారు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా తాను మీకు లొంగనని తేల్చిచెప్పారు. అది ఈ జన్మలో జరగదంటూ లేఖలో పేర్కొన్నారు.
గోచీ, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. దమ్మూ, ధైర్యం ఉంటే మీరు తిట్టండి. నేను మీ బానిసను కాదు. దమ్ముంటే నాపై పోటీచేసి గెలవండి అంటూ ముద్రగడ సవాల్ చేశారు. కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని తేల్చేశారు. నా భార్య మంగళసూత్రం తెంపి.. పోలీసులు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరెక్కడికి వెళ్లారని ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తొలి లేఖపై పవన్ మాట్లాడకుండా అభిమానులతో తిట్టిస్తున్నారని ముద్రగడ అనుమానిస్తున్నారు. అందుకే రెండో లేఖను ఘాటుగా రాశారు. ఇంకా చాలా విషయాలనే ఆయన ప్రస్తావించారు.
1988 వంగవీటి మోహన్ రంగా హత్య నుంచి మొన్నటి తుని విధ్వంసం వరకూ అమాయకులు జైలుపాలైతే మీరు పరామర్శించారా అంటూ ముద్రగడ పవన్ ను ప్రశ్నించారు. కేసుల ఎత్తివేత గురించి సీఎంలతో మాట్లాడిన సందర్భాలున్నాయా అంటూ నిలదీశారు. కాపుల గురించి నిస్వార్థంగా అవన్నీ తాను చేశానని.. కానీ నేను పదవుల కోసం ఉద్యమాన్ని అమ్ముకున్నానంటూ ఆరోపణలు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మీది సినిమా అభిమానమని.. కానీ జాతిపై అభిమానంతోనే తాను ఉద్యమంలోకి దూకి ఎన్నోవిధాలా నష్టపోయిన విషయాన్ని ప్రస్తావించారు. మీరు సవాల్ చేస్తున్నట్టే కాకినాడ నుంచి ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోటీచేస్తారని.. మీరు పోటీచేయాలని సవాల్ చేశారు. లేకుంటే పిఠాపురంలో తనపై పోటీచేసి గెలవాలని ముద్రగడ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికైతే ముద్రగడ మొదటి లేఖ పెద్దగా ప్రభావం చూపకపోవడం, పవన్ స్పందించకపోవడంతో.. అభిమానులను అడ్డం పెట్టుకొని రెండో లేఖ రాయయడం చర్చనీయాంశంగా మారింది.