Company Registrations: కంపెనీల ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం వస్తుంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి దండిగా రాబడి ఉంటుంది. అందువల్లే కంపెనీల ఏర్పాటుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. భూములు, విద్యుత్తు, నీరు, మానవ వనరులు వంటివి కల్పించేందుకు చొరవ చూపుతాయి. కంపెనీల ఏర్పాటుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు వాటి వాటి పారిశ్రామిక విధానాలను అమలు చేస్తుంటాయి. ఇందులో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరు ఉంటుంది. అయితే తాజాగా భారత కార్పొరేట్ మంత్రిత్వ వ్యవహారాల శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు కంపెనీలను ఆకర్షించడంలో.. కంపెనీల రిజిస్ట్రేషన్లలో ముందు వరుసలో ఉన్నాయి. మొన్నటిదాకా ఈ రెండు రాష్ట్రాలు గొప్పగా కంపెనీలను ఆకర్షించిన దాఖలాలు లేవు. ఏపీలో మరీ దారుణంగా గత ఐదు సంవత్సరాలలో కంపెనీల రిజిస్ట్రేషన్లు పెరిగిన ఉదాహరణలు లేవు. కల్లోలిత రాష్ట్రంగా పేరు పొందిన మాణిపూర్ లో ఆశ్చర్యకరంగా కంపెనీల రిజిస్ట్రేషన్లు పెరగడం సరికొత్త సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.
కేవలం తొమ్మిది జిల్లాలు మాత్రమే..
జూలై నుంచి సెప్టెంబర్ 2024 మధ్యకాలంలో కంపెనీల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఒకసారి పరిశీలిస్తే..టాప్ -50 జిల్లాలలో కేవలం 9 జిల్లాలు మాత్రమే వాటి గతకాలపు ఘనతను సాధించాయి. మిగిలిన 39 జిల్లాలు తమ క్షీణతను ప్రతిబింబించాయి. ఢిల్లీలో 15%, బెంగళూరు 17%, ముంబై 13 శాతం కంపెనీల తగ్గుదలను నమోదు చేశాయి. 2024 -25 కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో మహారాష్ట్ర 13.2%, ఉత్తరప్రదేశ్ 16.5% క్షీణతను నమోదు చేశాయి. అయితే ఈ కాలంలో ఆంధ్ర ప్రదేశ్, మణిపూర్ లో కొత్త కంపెనీల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. కంపెనీల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మణిపూర్ ప్రాంతంలో శాంతి నెలకొనడంతో ఆ ప్రాంతాలలో కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. 2023 జూలై – సెప్టెంబర్ కాలంలో ఢిల్లీలో 4,500 వరకు కంపెనీలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మరుసటి ఏడాది అదే కాలానికి 4000 కంటే తక్కువ పడిపోయింది. బెంగళూరులో 2023 జూలై – సెప్టెంబర్ కాలానికి 3500 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా.. మరుసటి ఏడాది అదే కాలానికి 2500 పడిపోయింది. ముంబైలో 2023 జూలై – సెప్టెంబర్ కాలానికి 3,500 కంపెనీలు రిజిస్ట్రేషన్ కాగా.. మరుసటి ఏడాది అదే కాలానికి 2500కు పడిపోయింది.. పూణే లో 2023 జూలై – సెప్టెంబర్ కాలానికి 2000 కంపెనీలు రిజిస్ట్రేషన్ కాగా.. మరుసటి ఏడాది అదే కాలానికి 1900 కు పడిపోయింది.. హైదరాబాదులో 2023 జూలై – సెప్టెంబర్ కాలానికి 2000 కంపెనీల రిజిస్ట్రేషన్లు పూర్తికాగా.. మరుసటి ఏడాది అదే కాలానికి 1700 కు పడిపోయింది. థానే లోనూ ఇదే తిరోగమనం కొనసాగుతుండగా.. గౌతమ్ బుద్ధ నగర్, గురు గ్రామ్, అహ్మదాబాద్, జైపూర్ ప్రాంతంలో మాత్రం మునుపటి కాలం మాదిరిగానే కంపెనీల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.