Amaravati Capital: రాష్ట్రం పరిస్థితి తాను చూసుకుంటానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే రాష్ట్రాన్ని గాడిలో పెడతానని కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసి సంపద సృష్టిస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అమరావతి తో పాటు రాష్ట్ర అభివృద్ధి బాధ్యతను ప్రజలకు అప్పగిస్తున్నారు. దీనిపైనే పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 20వేల రూపాయల చొప్పున సాయం అందిస్తానని ప్రకటించారు. ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20 వేల నగదు అందిస్తామన్నారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 రూపాయలు చొప్పున నెలకు అందిస్తానని కూడా హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు అవుతున్న ఒక్క పింఛన్ పథకం పెంపు తప్ప.. మరొకటి అందించలేకపోయారు. ఇప్పుడు తరచూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం అంటే సాహసమేనని సంకేతాలు ఇస్తున్నారు. సాధ్యం కాదని కూడా పరోక్షంగా హింట్ ఇస్తున్నారు. దీంతో ప్రజల్లో ఒక రకమైన అయోమయం నెలకొంది. సంపద సృష్టిస్తామన్నవారు.. ఇప్పుడు ఎందుకు మడత పేచి వేశారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం సంతృప్తికర సమాధానం రావడం లేదు.
* అమరావతికి విరాళాలు
తాజాగా అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు స్వచ్ఛంద విరాళాల సేకరణకు ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం బలవంతపు సేకరణలకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్వాక్రా మహిళల నుంచి వంద రూపాయలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ప్రతి సభ్యురాలు విధిగా 100 రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి ఇవ్వాల్సిందేనని వచ్చిన ఆదేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్వాక్రా సంఘాలను పర్యవేక్షించే మహిళ అధికారులతో సమాచారం ఇస్తున్నారు. అందులో భాగంగా డ్వాక్రా సంఘాల సభ్యుల వాట్సాప్ గ్రూపులో ఓ మహిళ అధికారిణి వంద రూపాయలు అడుగుతూ చేసిన వ్యాఖ్యలను వైసిపి సోషల్ మీడియా పోస్ట్ చేసింది. విపరీతంగా ఇది వైరల్ అవుతోంది.
* బడ్జెట్ కేటాయింపులు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. దీంతో అమరావతికి కొత్త ఊపిరి వచ్చింది. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. నిపుణులు, అధికారులు అధ్యయనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. త్వరలో పనులు కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఇటువంటి తరుణంలో డ్వాక్రా సంఘాల నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది.
* సొంత జిల్లా నుంచి ప్రారంభం
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై దృష్టి పెట్టింది. రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి వివిధ రూపాల్లో విరాళాలు సేకరించాలని ప్రణాళికగా పెట్టుకుంది. అందులో భాగంగానే డ్వాక్రా సంఘాల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా, సొంత నియోజకవర్గం నుంచి ప్రక్రియ ప్రారంభించింది. సీఎం అయిన తర్వాత సొంత నియోజకవర్గ కుప్పం వెళ్లిన చంద్రబాబుకు.. చిత్తూరు జిల్లా డ్వాక్రా సంఘాల తరఫున అమరావతి రాజధాని నిర్మాణానికి.. రూ. 4.5 కోట్లు అందించారు.అయితే ఇది స్వచ్ఛందంగా ఇచ్చింది కాదని.. రాష్ట్రవ్యాప్తంగా వసూలు చేసేందుకు శ్రీకారం చుట్టారని తాజాగా తెలుస్తోంది. రాష్ట్రం బాధ్యత నాది అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ బాధ్యతను ప్రజలపై నెట్టడం ఎంతవరకు భావ్యమని వైసిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
అమరావతికి డబ్బు లివ్వండి – డ్వాక్రా సభ్యుల నుంచి వసూళ్లు:
ఎన్నికల ముందు వరకూ ఈరాష్ట్రం బాధ్యత చంద్రబాబుది. ఎన్నికలయ్యాక అమరావతి సహా ఈ రాష్ట్రం బరువు, బాధ్యత ప్రజలది. దీంట్లో భాగంగా అమరావతి నిర్మాణంకోసం ఇప్పుడు విరాళాల సేకరణ జరుగుతోంది. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఇటుకలు అమ్మి… pic.twitter.com/CHfP97jNuo
— YSR Congress Party (@YSRCParty) August 6, 2024
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More