Public opinion on coalition government : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 164 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని విజయం సాధించింది. నరాలు ఉత్కంఠకు ఆరోజు తెర పడింది. మే నెలలో ఎన్నికల పోలింగ్ జరగగా.. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. అదే నెల 12న టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు తో పాటు 24 మంది మంత్రులు పదవీ ప్రమాణం చేశారు. క్యాబినెట్లో ఒక మంత్రి పదవి మాత్రం ఖాళీగా ఉంది.
* అభివృద్ధి జరగలేదని..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. నవరత్నాలు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కూడా అందించారు. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఆపై రాజకీయ కక్షపూరిత చర్యలు, టిడిపి తో జనసేన జత కట్టడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇదే కూటమిలోకి రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అయితే మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏడాది పాలనలో సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయింది. పింఛన్ మొత్తాన్ని పెంచి అందించగలిగింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తొలి విడతగా అందించింది. ఈ రెండు పథకాలకు మినహాయించి.. ప్రధానమైనవి ఏవీ పట్టాలు ఎక్కలేదు.
* ఆ అంశాల్లో సక్సెస్..
అయితే పాలనాపరమైన విధానాలు, నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం కూటమి ప్రభుత్వం( Alliance government) సక్సెస్ అయ్యింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రకాల చెల్లింపులను, రాజ్యాంగబద్ధ నిధుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యం చేసింది. వాటన్నింటినీ గాడిలో పెట్టి.. నిధులు విడుదల చేసి.. అన్నింటిని ఒక కొలిక్కి తెచ్చింది. మరోవైపు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించింది. ఏడాదికాలంగా వాటి నిధుల సమీకరణ పై దృష్టి పెట్టి విజయవంతం అయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం నిధులు సేకరించగలిగింది. గత ఐదేళ్లుగా వైసీపీ సంక్షేమ బాట పట్టడంతో అభివృద్ధి అన్న జాడలేకపోయింది. అందుకే గ్రామాల్లో అభివృద్ధికి పల్లె పండుగ పేరిట భారీగా నిధులు మంజూరు చేసింది.
* ఆసక్తిగా గమనిస్తున్న తటస్తులు..
అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి( Amravati capital ), పోలవరం ప్రాజెక్టులతోపాటు అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. దీంతో ప్రజల్లో సంక్షేమ పథకాల విషయంలో కొద్ది రోజులపాటు వేచి చూద్దామన్న ధోరణి కనిపించింది. ప్రభుత్వ చర్యలపై మిశ్రమ స్పందన కూడా వచ్చింది. ఇంకోవైపు రాజకీయపరంగా ప్రతిపక్షం అనుకున్న స్థాయిలో ముందుకెళ్లకపోవడం కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా అందడంతో తటస్తులు, మేధావులు, విద్యాధికులు.. గత ఐదేళ్ల పరిస్థితిలను గుర్తుచేసుకొని.. కూటమి ప్రభుత్వానికి అనుకూలత వ్యక్తం చేశారు. కూటమిపాలన రెండో ఏడాదిలోకి అడుగుపెట్టడంతో సంక్షేమ పథకాల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో ప్రజల్లో మరింత సానుకూలత వ్యక్తం అవుతుందని కూటమి సర్కార్ ఆశిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.