Telangana DGP : తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌.. కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!

Telangana DGP : రాష్ట్రంలో పోలీస్‌ శాఖను సమూల ప్రక్షాళన చేయడంతోపాటు కీలక పోస్టుల భర్తీపై రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఏసీపీలు, ట్రాఫిక్‌ కమిషనర్‌ పోస్టులు సమర్ధులైన అధికారులకు అప్పగించేలా కసరత్తు జరుగుతోంది.

Written By: NARESH, Updated On : June 10, 2024 3:45 pm

CM Revanth Reddy is working for the new DGP of Telangana

Follow us on

Telangana DGP : లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టిపెట్టారు. ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుబంధు జమ, పంట రుణాల మాఫీకి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో కీలక అధికారుల మార్పులు చేర్పులపైనా కసరత్తు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికకు కూడా కసరత్తు మొదలు పెట్టారు.

ఐఏఎస్, ఐపీఎస్‌లకు స్థాన చలనం..
పాలనాపరంగా తన మార్కు చూపించేందుకు రేవంత్‌ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో అధికారుల పాత్ర కీలకం కావడంతో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు ముఖ్య అధికారులను మార్చాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త డీజీపీని కూడా నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త డీజీపీపై ఇప్పటికే సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ?
సీఎం రేవంత్‌ కసరత్తు కొలిక్కి వస్తే.. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బదిలీ అవుతారని తెలుస్తోంది. సామాజిక న్యాయం, సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు చేపట్టేందుకు జాబితా సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.

కొత్తగా రెండు డీజీ ర్యాంకులు..
ఇదిలా ఉండగా రాష్ట్రానికి కేంద్రం కొత్తగా రెండు డీజీ ర్యాంకులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రవిగుప్తా, అంజనీ కుమార్, సీవీ.ఆనంద్, జితేందర్‌ డీజీ హోదాలో ఉన్నారు. 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ ఇటీవలే మరణించారు. సందీప్‌ శాండిల్య ఉద్యోగ విరమణ చేశారు. జితేందర్‌కు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించారు. అంజనీ కుమార్‌ రోడ్‌ సేఫ్టీ డీజీగా ఉన్నారు.

కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి..
ఇక రాష్ట్ర కొత డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించే అవకాశం ఉంది. తాజాగా డీజీ హోదాలో చోటుచేసుకున్న మార్పులతో 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌లలో ఒకరికి డీజీ ర్యాంక్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది. 1994 బ్యాచ్‌కు చెందిన అదనపు డీజీలు శివధర్‌రెడ్డి, శిఖ గోయల్, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, వినాయక ప్రభాకర్‌ ఆప్టే ఉన్నారు. వీరిలో ఇద్దరికీ డీజీ ర్యాంకు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డిలకు డీజీ ర్యాంకు కేటాయిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐబీ చీఫ్‌గా ఉన్న శివధర్‌రెడ్డిని రాష్ట్ర డీజీపీగా నియమిస్తారని తెలుస్తోంది. ఎస్‌బీ చీఫ్‌ గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని నియమించే ఛాన్స్‌ ఉంది.

పోలీస్‌ శాఖ ప్రక్షాళన..
రాష్ట్రంలో పోలీస్‌ శాఖను సమూల ప్రక్షాళన చేయడంతోపాటు కీలక పోస్టుల భర్తీపై రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఏసీపీలు, ట్రాఫిక్‌ కమిషనర్‌ పోస్టులు సమర్ధులైన అధికారులకు అప్పగించేలా కసరత్తు జరుగుతోంది. పోలీస్‌ కమిషనరేట్లు, జిల్లాలోనూ భారీ ఎత్తున పోలీస్‌ అధికారుల బదిలీల దిశగా కసరత్తు జరుగుతుంది. దీంతోపాటుగా రాష్ట్రంలో 9 పోలీస్‌ కమిషనరేట్‌లలో మార్పులు చేయాలని చెబుతున్నారు.