CM Jagan Vs Ramoji Rao: జర్నలిజం విలువలు దిగజారి పోతున్నాయి. అయితే అన్ని చోట్ల ఈ పరిస్థితి ఉంది. కానీ ఏపీలో మాత్రం విస్తృత స్థాయిలో విస్తరించింది. వైసీపీకి సాక్షితో పాటు నీలి మీడియా, టిడిపికి బలమైన ఎల్లో మీడియా మద్దతుగా నిలుస్తున్నాయి. పూర్తిగా రాజకీయ ముసుగులో మునిగిపోయాయి. జర్నలిజం విలువలను దిగజార్చి వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఈనాడులో వచ్చిన కథనం చూస్తే మరీ ఇంత దిగజారుడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తే.. దానికి వక్ర భాష్యం చెప్పి ఫుల్ పేజీ వ్యతిరేక కథనాన్ని ప్రచురించింది. జగన్ పట్ల రాజ గురువు రామోజీ ఆకాంక్షలకు తగ్గట్టు ఈ కథనం ఉంది.
తెలంగాణలో సైతం కెసిఆర్ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటు గుజరాత్ లో పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో కెసిఆర్ తో పాటు ప్రధాని మోదీని ఈనాడు ఆకాశానికి ఎత్తేసింది. సమైక్య చిహ్న వారసులుగా వారిని పేర్కొంది. ఈనాడు మీడియాలో ప్రాధాన్యత స్థాయిలో కథనాలను వండి వార్చారు. ఇప్పుడు అదే పని జగన్ చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం అభినందించకపోగా.. వ్యతిరేక కథనాలను, తప్పుడు విషయాలను గుర్తు చేసి జగన్ ప్రజల్లో పలుచన చేయాలని చూశారు. ముఖ్యంగా తటస్థులు, ఏ పార్టీతో సంబంధం లేని వారిపై ప్రభావం చూపాలని ఎత్తుగడవేశారు.
అయితే ఈ విషయంలో జగన్ గట్టిగానే తిప్పికొట్టారు. రాజ గురువు రామోజీ రాతలను తప్పు పట్టారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ కీలక ప్రసంగం చేశారు. ఇప్పటికీ సమాజంలో అంటరానితనం కొనసాగుతోందని.. మంచి పనులు చేసే వారిని అవినీతిపరులుగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. తప్పుడు రాతలతో ఈనాడు అంబేద్కర్ అవమానపరిచిందని ఆరోపణలు చేశారు. అంబేద్కర్ మాతృభాషను కొనసాగించాలని అభిలాషించారని.. కానీ జగన్ సర్కార్ మాత్రం ఇంగ్లీష్ మీడియం బలవంతంగా ప్రవేశపెట్టి తెలుగు భాషను అవమానపరిచిందని ఈనాడులో రాసుకొచ్చారు. అదే విషయాన్ని ప్రస్తావించిన జగన్.. అంబేద్కర్ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనని గుర్తు చేశారు. మీ పిల్లలు, మీ మనుమలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి.. పేదల మాత్రం చదువుకోవద్దా? అని ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం ప్రయత్నాలను ప్రజలు గమనించాలని.. వారి మాయ మాటలను నమ్మవద్దని జగన్ విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే రాజగురువు రామోజీ కుయుక్తులను జగన్ బాగానే తిప్పి కొట్టారు.