CM Chandrababu: పట్టాదారు పాసుపుస్తకాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

వైసిపి అందించిన పట్టాదారు పాసుపుస్తకాలలో రైతు ఫోటో చిన్నది, సీఎం జగన్ ఫోటో పెద్దదిగా పెట్టడంతో విమర్శలు వచ్చాయి. అప్పట్లో విపక్ష నేతగా చంద్రబాబు సైతం దీనిని తప్పు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సరి చేస్తామని హామీ ఇచ్చారు.

Written By: Dharma, Updated On : June 27, 2024 4:25 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఏపీలో రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసిపి ప్రభుత్వం అప్పటి సీఎం జగన్ ఫోటోతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు అందించిన సంగతి తెలిసిందే. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు విపక్షాలు కూడా అభ్యంతరాలు తెలిపాయి. అయినా జగన్ సర్కార్ పెడచెవిన పెట్టింది. అందుకే అధికారంలోకి వస్తే పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో కొత్త విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు.. పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించిన ఆయన పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీ మేరకు పట్టాదారు పాస్ పుస్తకాలను మార్చనున్నట్లు ప్రకటించారు.

వైసిపి అందించిన పట్టాదారు పాసుపుస్తకాలలో రైతు ఫోటో చిన్నది, సీఎం జగన్ ఫోటో పెద్దదిగా పెట్టడంతో విమర్శలు వచ్చాయి. అప్పట్లో విపక్ష నేతగా చంద్రబాబు సైతం దీనిని తప్పు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సరి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు రాజముద్ర తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే దీనిపై ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు మూడు నెలల్లో ప్రక్రియను పూర్తి చేసి.. రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మరోవైపు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా దీనిపై సమీక్షించారు.

ఈ ఎన్నికల్లో విపక్షాలకు పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రచార అస్త్రంగా మారింది. పులివెందులలో భర్త జగన్ తరుపున భారతి రెడ్డి ప్రచారం చేశారు. ఓ గ్రామంలో ప్రచారం చేస్తుండగా వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్న ఒక వ్యక్తి ఆమెను ప్రశ్నల వర్షం కురిపించాడు. తమ భూమి పత్రాలపై నీ భర్త ఫోటో ఎందుకని.. అది మంచి పద్ధతి కాదని.. తక్షణం తొలగించే ఏర్పాట్లు చేయాలని ఆయన నిలదీసినంత పని చేశాడు. అప్పట్లో అదో వైరల్ అంశంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫోటో ఉండడాన్ని ఎక్కువమంది తప్పు పట్టడం ప్రారంభించారు. ఒక విధంగా చెప్పాలంటే వైసిపి ఓటమికి ఇవే ప్రధాన కారణాలు. అందుకే ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీ మేరకు.. రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. ఈ మేరకు రెవెన్యూ శాఖకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.దాదాపు 20 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ వెనక్కి రప్పించనుంది. వాటి స్థానంలో కొత్త వాటిని అందించనుంది.