Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డికి షాక్.. పుంగనూరులో వైసీపీ ఖాళీ

పుంగనూరు నుంచి సుదీర్ఘకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి పెద్దిరెడ్డి కుటుంబం హవా నడుస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి హవా చలాయించడం ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : June 27, 2024 4:19 pm

Peddireddy Ramachandra Reddy

Follow us on

Peddireddy Ramachandra Reddy: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ తగిలింది. పుంగనూరు నియోజకవర్గం నుంచి టిడిపిలో చేరికలు పెరిగాయి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా తో పాటు 12 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. స్థానిక టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి కొంతమంది కౌన్సిలర్లు టిడిపిలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. అదే జరిగితే పుంగనూరు మున్సిపల్ పీఠం తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరినట్టే.

పుంగనూరు నుంచి సుదీర్ఘకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి పెద్దిరెడ్డి కుటుంబం హవా నడుస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి హవా చలాయించడం ప్రారంభించారు. ఒక్క పుంగనూరు కాదు రాయలసీమ నాలుగు జిల్లాల్లో పెద్దిరెడ్డి కను సన్నల్లో రాజకీయాలు నడిచేవి. చిత్తూరు జిల్లాను సైతం శాసించారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని శపధం చేశారు. ఒక మాజీ సీఎం గా చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టలేని విధంగా వైసీపీ శ్రేణులు వ్యవహరించడం వెనుక పెద్దిరెడ్డి ఉన్నారన్నది బహిరంగ రహస్యం. అయితే ఏపీలో వైసిపి అధికారానికి దూరం కావడంతో పెద్దిరెడ్డికి సీన్ రివర్స్ అవుతోంది. ఆయన సామ్రాజ్యానికి బీటలు వారుతున్నాయి.

వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత పెద్దిరెడ్డి విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. ఆయన కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన యంత్రాలు, వాహనాలను అప్పట్లో దక్షిణాఫ్రికాకు తరలించినట్లు టాక్ నడిచింది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి కనీసం మీడియాకు సైతం దొరకలేదు. జగన్ తర్వాత చంద్రబాబు సర్కార్కు పెద్దిరెడ్డి టార్గెట్ అవుతారని విశ్లేషణలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే పుంగనూరు మున్సిపల్ కార్యవర్గమంతా తెలుగుదేశం పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా టిడిపిలో చేరిన కౌన్సిలర్లంతా వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం విశేషం. పేరుకే మున్సిపల్ చైర్మన్ అని.. పవర్ అంతా పెద్దిరెడ్డి వద్ద ఉండిపోయిందని అలిన్ భాష ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మరి కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరతారని.. పుంగనూరు మున్సిపల్ కార్యాలయం పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు. అంతకుముందు కూడా పుంగనూరులో పర్యటిస్తుండగా వైసీపీ శ్రేణులు అరాచకాలు సృష్టించాయి. ఆ సమయంలోనే చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పుంగనూరు పుడింగు అంటూ పెద్దిరెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తప్పకుండా పెద్దిరెడ్డి సామ్రాజ్యాన్ని కూలగొడతామని హెచ్చరించారు. ఇప్పుడు అన్నంత పని చేశారు. చంద్రబాబు కుప్పం పర్యటన ముగిసిందో లేదో.. పుంగనూరు మున్సిపల్ కార్యవర్గమంతా తెలుగుదేశం పార్టీలో చేరడం విశేషం.