Chandrababu on New Districts: ఏపీలో( Andhra Pradesh) కొత్త జిల్లాల ఏర్పాటు పై కదలిక వచ్చింది. కొత్త జిల్లాలతో పాటు ఇప్పటికే ఏర్పడిన జిల్లాల్లో చేర్పులు మార్పులు, డివిజన్లో మార్పులు వంటి వాటిపై అధ్యయనం వేగవంతం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీతో సమావేశం అయ్యారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యారు. కూటమి అధికారంలోకి వస్తే కొత్త జిల్లాల ఏర్పాటు పై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ ఏడాది జూలై 22న ఏడుగురు సభ్యులకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాల విభజన పై విమర్శలు..
వైసీపీ( YSR Congress ) హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లను సైతం ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో జిల్లాల విభజనలో హేతుబద్ధత పాటించలేదన్న విమర్శ ఉంది. చాలా ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లాల ఏర్పాటు ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తం అయిందని.. కానీ అప్పటి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. పైగా కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల చేర్పు వెనుక ప్రజల్లో అసంతృప్తి దాగి ఉందని.. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పై అభ్యంతరాలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజల ఆకాంక్షలను వినతుల రూపంలో స్వీకరించారు. కొత్తగా నాలుగు నుంచి ఆరు జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక జిల్లాగా అమరావతి..
ప్రధానంగా అమరావతిని( Amravati capital) ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మార్కాపురం తో పాటు పలాస కొత్త జిల్లాల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏజెన్సీలోని రెండు నియోజకవర్గాలతో పాటు విలీన మండలాలతో కలిపి ప్రత్యేక జిల్లా ప్రకటిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. జూలైలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో అక్టోబర్ నాటికి కసరత్తు పూర్తవుతుందని భావించారు. కానీ అది వీలు కాలేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మంత్రుల సబ్ కమిటీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. త్వరలో మరో సమావేశం నిర్వహించి.. మరింతగా లోతుగా అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.