Chandrababu key instructions: ఏపీ ( Andhra Pradesh)పై తీవ్ర తుఫాన్ ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రళయ భీకరంగా మారిన ప్రచండ తుఫాన్ కాకినాడ తీరం వైపు దూసుకొస్తోంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాల తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తుఫాను చర్యలపై కూటమి పార్టీల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ చర్యల్లో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే..
ఏపీకి తీవ్ర తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు( CM Chandrababu) సోమవారం నుంచి అప్రమత్తం అయ్యారు. సచివాలయంలో ఆర్టిజిఎస్ కేంద్రంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకున్నారు. అన్ని జిల్లాల యంత్రాంగాలతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి అత్యవసర పరిస్థితి నైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా సీఎం చంద్రబాబు తో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఎస్డిఆర్ఎఫ్ తో పాటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులోకి ఉంచినట్లు ప్రధానికి చంద్రబాబు వివరించారు. ఇంకోవైపు తక్షణ సహాయ చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలను విడుదల చేశారు. మిగతా జిల్లాలకు సైతం 50 లక్షల చొప్పున కేటాయించారు. సోమవారం అర్ధరాత్రి వరకు సచివాలయంలో ఉండి చంద్రబాబు సమీక్షలు జరిపారు.
పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్..
అయితే ఈరోజు పార్టీ శ్రేణులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్( video conference) నిర్వహించారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు తమ సొంత నియోజకవర్గాలు, జిల్లాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. రెండు రోజులపాటు ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. ప్రాణ ఆస్తి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. దాదాపు 39 నియోజకవర్గాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని.. ఆయా నియోజకవర్గాల కూటమి నేతలతో నేరుగా మాట్లాడారు సీఎం చంద్రబాబు.