CM Chandrababu : రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ( Chandrababu) దావోస్ పర్యటన సాగుతోంది. ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు వరుసగా భేటీ అవుతున్నారు. మరోవైపు అక్కడ స్థిరపడిన తెలుగు ప్రముఖులతో సైతం సమావేశం అవుతున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. అందుకు ఏపీలో ఉన్న అనుకూలమైన అంశాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ తో సమావేశం అయ్యారు బాబు. మంత్రి నారా లోకేష్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయాయని గుర్తు చేశారు చంద్రబాబు. అదే స్ఫూర్తితో ఏపీలో కూడా ఐటి అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. అన్నింటికీ మించి ప్రపంచస్థాయి ఏఐ యూనివర్సిటీ సలహా మండలి లో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. సౌత్ ఇండియాలో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలను ఏపీ నుంచి సాగేలా చూడాలని మంత్రి లోకేష్ కోరారు. అలాగే ఏపీలో ఐటి అభివృద్ధికి విలువైన సలహాలు సూచనలు అందించాలని కోరారు.
* అప్పట్లో అలా
గతంలో మైక్రోసాఫ్ట్ అధినేతగా ఉండేటప్పుడు బిల్ గేట్స్ ను ( Bill Gates) చంద్రబాబు కలిశారు. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు అప్పట్లో హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ ఐటీ సంస్థను ఏర్పాటు చేశారు. అటు తరువాతే హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఐటీ కి స్వర్గధామం గా మారింది. మరోవైపు విశాఖను ఐటి హబ్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో బిల్ గేట్స్ కలిసిన చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్లో తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నొస్టిక్స్ ని ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరుపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ముఖ్యంగా నైపుణ్య సహకారం మీ నుంచి కోరుకున్నట్లు గేట్స్ కు వివరించారు చంద్రబాబు. ఫౌండేషన్ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలు అమలు చేసేలా ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు.
* చాలా ఆనందంగా ఉంది
అయితే ఏపీ సీఎం చంద్రబాబును( CM Chandrababu) కలుసుకోవడంపై బిల్ గేట్స్ స్పందించారు. చంద్రబాబుని చాలా కాలం తర్వాత కలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 1995లో ఐటీ కోసం, 2025లో ఏ ఐ కోసం బిల్ గేట్స్ తో భేటీ అయినట్లు చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత బిల్ గేట్స్ ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు బాబు.
* విజయవంతంగా పర్యటన
దావోస్ ( davos) పర్యటనకు సంబంధించి నాలుగు రోజుల కిందట సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఒక బృందం వెళ్ళింది. ఈ బృందంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు లోకేష్, టీజీ భరత్ ఉన్నారు. అక్కడ చంద్రబాబు మూడు రోజుల పాటు పెట్టుబడుల వేట కొనసాగించారు. గ్లోబల్ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అనుకూల అంశాలను వారికి వివరించారు. గూగుల్ క్లౌడ్, పెప్సికో, పెట్రో నస్ సంస్థ ప్రతినిధులతో చర్చించి.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Hon’ble Chief Minister, Shri @ncbn, met with Mr @BillGates at the @wef Annual Meeting in Davos today. They discussed opportunities to collaborate on health, AI, and innovation to drive progress in Andhra Pradesh. @BMGFIndia #InvestInAP pic.twitter.com/S2otaIn0it
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 22, 2025