Hyderabad Meerpet Incident: హైదరాబాదులోని మీర్ పేట ప్రాంతంలో జరిగిన దారుణానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నా కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గురుమూర్తి చెబుతున్న విషయాలు పోలీసులకే ఒళ్ళు జలదరించేలా చేస్తున్నాయి. గురుమూర్తి ఆర్మీలో జవాన్ గా పని చేశాడు. ఆర్మీలో తన సర్వీస్ పూర్తయిన తర్వాత డిఆర్డిఓ లో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నాడు. మొదటినుంచి గురుమూర్తిది అనుమానపూరితమైన బుద్ధి. భార్యను నిత్యం అనుమానిస్తుండేవాడు. ఆమె ఫోన్, కదలికలను నిత్యం కనిపెడుతూనే ఉండేవాడు. చివరికి పడకగదిలోనూ సీసీ కెమెరా ఏర్పాటు చేశాడట. అయితే భార్య మాధవి తో ఇటీవల కాలంలో గురుమూర్తికి గొడవలు ఎక్కువైపోయాయి. ఈనెల 16న తీవ్రంగా గొడవ అయింది. అంతకుముందే అతడు ఆమెను అంతమొందించాలని భావించాడు. దానికి ముందుగా కుక్కపై ప్రయోగం చేశాడు. ఒక కుక్కను హతమార్చాడు. ఆ తర్వాత దాని శరీర భాగాలను వేరు చేసి.. కుక్కర్లో ఉడికించి.. ఆ తర్వాత ఆ భాగాలను ఎండపెట్టి పొడి చేశాడు. అంతటి దారుణానికి పాల్పడుతున్నప్పటికీ అతడిలో ఏమాత్రం మానవత్వం మచ్చుకు కూడా కనిపించలేదు. పైగా తన భార్యను అంతమొందించిన తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టడానికి దృశ్యం (drishyam movie) సినిమాను చూశాడట.
ఆ సినిమాలో చూపించినట్టుగానే..
దృశ్యం సినిమాలో చూపించినట్టుగానే.. తన భార్యను అంతమొందించిన తర్వాత ఆమె మృతదేహాన్ని గురుమూర్తి దాచాడట. ఆ తర్వాత యూట్యూబ్లో పలు నేరపూరితమైన సినిమాలు చూసి.. ఓటీటీలో పలు హింసాత్మకమైన ధారవాహికలు చూసి.. వాటి ద్వారా స్ఫూర్తి పొంది.. మాధవి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడట. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను పెద్దపెద్ద కుక్కర్లలో ఉడికించాడట. ఆ తర్వాత ఆ ముక్కలను ఎండబెట్టి పొడిచేసి మీర్ పేట చెరువులో కలిపాడట. అయితే ఉప్పల్ ప్రాంతంలో ఉంటున్న గురుమూర్తి సమీప బంధువుకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాకపోతే పోలీస్ విచారణలో ఈ విషయాలు మొత్తం చెప్పిన గురుమూర్తి లో ఏమాత్రం పశ్చాతాపం కనిపించకపోవడం శోచనీయం. ఈ ఘటన జరిగిన తర్వాత మీడియాలో పెద్ద పెట్టున వార్తలు వస్తున్నాయి. చాలామంది ఈ ఘటనను తలుచుకొని.. వామ్మో ఇలా కూడా చేస్తారా అంటూ గుండెలు బాదుకొంటున్నారు. కానీ అంతిమంగా మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది.. భార్యపై నమ్మకం సన్నగిల్లిపోతోంది.. మనిషి అనే వాడు పూర్తిగా క్రూర మృగాల కంటే దిగజారి పోతున్నాడు అనే నిజాలను మాత్రం ఎవరూ ఒప్పుకోవడం లేదు.