CM Chandhrababu : ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు.ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిఎస్, కలెక్టర్లతో సమీక్షించిన చంద్రబాబు నేరుగా వరద బాధిత ప్రాంతాలకు వెళ్లారు. బోటులో భద్రతా సిబ్బంది సాయంతో పరిశీలించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్కు వచ్చి సమీక్షలు జరిపారు. పునరావాస చర్యలపై అధికారులకు సలహాలు,సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలియజేయడంలో అధికారులు విఫలం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.అందుకే నేరుగా రంగంలోకి దిగారు. రాత్రి 11 గంటల సమయంలో వరద బాధిత ప్రాంతాల పరిశీలకు బయలుదేరారు. అయితే భద్రతా సిబ్బంది వద్దు అని వారించినా వినలేదు. అజిత్ సింగ్ నగర్,కృష్ణలంక,ఇబ్రహీంపట్నం, ఫెర్రీ,జూపూడి, మూలపాడు తదితర ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. వేకువ జామున నాలుగు గంటల వరకు చంద్రబాబు బాధిత ప్రాంతాల్లో సందర్శించారు.బాధితులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఎవరు అధైర్య పడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. నిర్విరామ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు ఉదయం నాలుగు గంటల సమయంలో విజయవాడ కలెక్టరేట్ వద్దకు వచ్చారు. అక్కడే ఏర్పాటు చేసిన బస్సులో విశ్రాంతి తీసుకున్నారు. మళ్లీ ఉదయం తొమ్మిది గంటల సమయంలో వరద బాధిత ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు.
* వరద బాధితులకు భరోసా
ఈ ఒక్క రాత్రి ఆగండి. సోమవారం మధ్యాహ్నం కల్లా మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తానని విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాసులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు వెళ్లిన వెంటనే అక్కడ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వరద బాధితులు చెప్పే ప్రతి ఫిర్యాదును చంద్రబాబు స్వయంగా రాసుకున్నారు. విజయవాడ నగరం యధాస్థానానికి వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఉదయం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. అక్కడి నుంచే అధికారులతో సమీక్షలు జరిపారు. బాధితులకు ఆహారం, సహాయ చర్యలపై కీలక ఆదేశాలు ఇచ్చారు.
* హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు
హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందించాలని ఆదేశించారు. మూడు పూటలా బాధితులకు ఆహారం అందించాలన్నారు. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులకు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని కూడా ఆదేశించారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని కూడా సీఎం ఆదేశించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
* విజయవాడకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీగా విజయవాడ చేరుకున్నాయి. తమిళనాడు నుంచి మూడు, పంజాబ్ నుంచి నాలుగు, ఒడిస్సా నుంచి మూడు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి వచ్చాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో చేరుకున్నారు. ఇప్పటికే సహాయ చర్యల్లో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి. వాయు మార్గం ద్వారా సేవలందించేందుకు నాలుగు హెలికాప్టర్లను తెప్పించినట్లు చంద్రబాబు ప్రకటించారు.
* ప్రత్యేక అధికారుల నియామకం
భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాలవారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉంటారు. పునరావాస కార్యక్రమాలపై సమీక్ష జరుపుతారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి 13 మంది అధికారులను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నలుగురిని, విజయవాడ తూర్పు నియోజకవర్గం నియమించింది. విజయవాడ రూరల్ నియోజకవర్గం అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రకటించింది.
* భద్రతను పక్కన పెట్టిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు తన భద్రతను పక్కనపెట్టి నేరుగా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చుట్టూ జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న బాధితులను నేరుగా తన వద్దకు పిలిచి మాట్లాడుతున్నారు. ఎటువంటి భయం పెట్టుకోవద్దని.. అండగా తాను ఉంటానని భరోసా ఇస్తుండడం విశేషం. అయితే సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో అధికారులు సైతం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, వరద క్రమేపి తగ్గుతుండడంతో సాయంత్రానికి సహాయ చర్యలు ఊపందుకుంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More