Yogi Raj : మహేంద్ర సింగ్ ధోనీకి టీమిండియాలోనూ హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సురేష్ రైనా, రవీంద్ర జడేజా వంటి వారు అతడిని సోదరుడి లాగా భావిస్తుంటారు. తమ ప్రేమను పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు.. ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయితే ధోనిని టీమిండియా ఒకప్పటి స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ తరచూ విమర్శిస్తుంటాడు. యోగిరాజ్ ఏడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు టీమిండియా తరఫున ఆడాడు.. అయితే మొదటి నుంచి కూడా ధోని అంటే యోగి రాజ్ మండిపడుతుంటాడు. దీనికి కారణం లేకపోలేదు. యువరాజ్ క్రికెట్ కెరియర్ ను ధోని నిర్వీర్యం చేశాడని యోగిరాజ్ ప్రధాన ఆరోపణ. “ధోనిని నేను ఎప్పటికీ క్షమించను” అని యోగి రాజ్ అనేక సందర్భాల్లో విమర్శించాడు. ఇటీవల కూడా అతడు ధోనిని దుయ్యబడ్డాడు. అది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ” మహేంద్రసింగ్ ధోని నేను క్షమించలేను. అతడు అద్దంలో తన ముఖాన్ని చూసుకోవాలి. అతడు పేరుకు చాలా పెద్ద క్రికెటర్. కానీ నా కొడుకు విషయంలో తీరని అన్యాయం చేశాడు. అప్పట్లో అది బయటికి రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రతిదీ కనిపిస్తోంది. నేను నా జీవితంలో తప్పు చేసిన ఎవరినీ క్షమించను” అని యోగిరాజ్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో పేర్కొన్నాడు.
ఇదే తొలిసారి కాదు
మహేంద్ర సింగ్ ధోనీ పై యోగి రాజ్ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ధోని చేసిన తప్పుల వల్లే చెన్నై ఓడిపోయిందని యోగి పేర్కొన్నాడు. యువరాజ్ పై ధోని అనేక సందర్భాల్లో అసూయను ప్రదర్శించాడని ఆరోపించాడు.”ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో చెన్నై జట్టు ఎందుకు ఓడిపోయింది? మీరు ఏ విత్తనం వేస్తే.. అలాంటి పంటనే కోస్తారు.. ధోనిని గుడ్డిగా నమ్మినందుకు చెన్నై జట్టు యాజమాన్యానికి కూడా అదే అనుభవం ఎదురయింది.. యువరాజ్ సింగ్ ఎదురైనప్పుడు ధోని కనీసం కరచాలనం కూడా చేయలేదు.. చెన్నై జట్టు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విఫలం అయ్యేందుకు అది కూడా ఒక కారణమని” యోగిరాజ్ పేర్కొన్నాడు. యోగిరాజ్ ధోనిపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారాయి. మరోవైపు 43 సంవత్సరాల ధోని ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికీ అతడు ఐపీఎల్లో యాక్టివ్ ప్లేయర్ గా ఉన్నాడు. అయితే వచ్చే సంవత్సరంలో ఐపిఎల్ లో అతడు ఆడతాడా? లేదా? అనే విషయాలపై ఇంతవరకు ఒక స్పష్టత లేదు. ఈ ఏడాది సీజన్లో చెన్నై జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More