https://oktelugu.com/

CM Chandrababu: చంద్రబాబు ఆలోచన తప్పు.. క్యాబినెట్ నుంచి కొందరు ఔట్

మంత్రులుగా యంగ్ స్టార్స్ తో పాలనను పరుగు పెట్టించాలని భావించారు చంద్రబాబు. కానీ ఇప్పుడు అదే యంగ్ స్టార్స్ విమర్శలకు కారణమవుతున్నారు. దీంతో వారి స్థానంలో సీనియర్లను తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 7, 2024 / 02:11 PM IST

    CM Chandrababu(9)

    Follow us on

    CM Chandrababu: చంద్రబాబు క్యాబినెట్ ను విస్తరిస్తారా? మంత్రులను మార్చేస్తారా? సీనియర్లకు చోటిస్తారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కూటమి గెలిచిన వెంటనే క్యాబినెట్ కూర్పు పై రకరకాల చర్చ నడిచింది. సీనియర్లకు పెద్దపీట వేస్తూ క్యాబినెట్ రూపొందిస్తారని అంతా భావించారు. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. కొత్తగా ఎన్నికైన పదిమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. సీనియర్లను పరిగణలోకి తీసుకోకపోవడం పై రకరకాల చర్చ నడిచింది. లోకేష్ కోసమే యంగ్ టీమ్ ను తీసుకున్నారని.. భవిష్యత్తు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. యువతను ప్రోత్సహించాలని అనుకూల మీడియా రాసుకోచ్చింది. అయితే ఐదు నెలల పాలన పూర్తికాకముందే కొందరి మంత్రుల తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో వారందరినీ తప్పిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. సహజంగానే ఇది వైసీపీకి అస్త్రమే. అయితే ఐదు నెలలకే మంత్రులను మార్చే ఉద్దేశం చంద్రబాబుకు ఉందా? అన్నది అనుమానం. ఇప్పుడు గానీ మంత్రులను మార్చితే ఏ రకమైన ఇబ్బంది వస్తుందో చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఈ విషయంలో మాత్రం నిజం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదంతా ఉత్త ప్రచారమేనని తేల్చేస్తున్నారు.

    *మహిళా మంత్రిపై వేటు?
    హోం మంత్రిగా మహిళా నేత వంగలపూడి అనితకు చాన్స్ ఇచ్చారు. ఆమె మహిళ..ఆపై దళిత నేత. గతంలో వైసిపి ప్రభుత్వం సైతం మేకతోటి సుచరితకు తొలుత అవకాశం ఇచ్చింది. అటు తర్వాత దానేటి వనితకు ఛాన్స్ కల్పించారు జగన్. అయితే ఆ ఇద్దరూ మహిళ నేతలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో అదే సంస్కృతిని కొనసాగించారు చంద్రబాబు. అయితే వంగలపూడి అనిత విద్యాధికురాలు కావడం, అంతకుముందు తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేయడం, దూకుడుగా వ్యవహరించడంతో ఆ పదవికి వన్నెతెస్తారని చంద్రబాబు భావించారు. కానీ పోలీస్ వ్యవస్థ పై సరిగ్గా పట్టు సాధించలేకపోయారు. ఆ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆమె వైఫల్యం కంటే పోలీస్ వ్యవస్థలో ఇంకా వైసీపీ ముద్ర ఫై పవన్ అనుమానం వ్యక్తం చేశారు. అసహనం ప్రదర్శించారు. అయితే ఇక్కడే వైసిపి రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. పవన్ పోలీస్ వ్యవస్థ పనితీరుపై మాట్లాడితే.. హోం శాఖ మంత్రిపై మాట్లాడినట్లు ప్రచారం చేస్తోంది.

    * చంద్రబాబు ఆగ్రహం
    ఇటీవల యువ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ సభ్యత్వాల విషయంలో వెనుకబాటుపై సీరియస్ అయ్యారు.ఎంతో నమ్మకంతో మంత్రి పదవి ఇస్తే ఇలా చేస్తారేంటి అని ప్రశ్నించారు. కాస్త కటువుగానే మాట్లాడారు. ఈ నేపథ్యంలో సుభాష్ ను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని ప్రచారం చేసింది వైసిపి.అయితే దీనిపై ఆ యువ మంత్రి స్పందించారు.చంద్రబాబు తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం నిజమేనని చెప్పుకొచ్చారు.తన పనితీరును మరింత మెరుగుపరుచుకుంటానని కూడా స్పష్టం చేశారు.అయితే సుభాష్ ను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని ఒక వర్గం మీడియా ప్రచారం చేయడం ప్రారంభించింది.కానీ నిన్న మంత్రివర్గంలో ఆ చర్చ లేకుండా పోయింది.

    * కుటుంబ సభ్యుల తీరు అభ్యంతరకరం
    కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య వైఖరి వివాదంగా మారింది. పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు ఆ మంత్రి పై అసంతృప్తితో ఉన్నారని.. క్యాబినెట్ నుంచి తొలగిస్తారని ప్రచారం చేయడం ప్రారంభించింది వైసీపీ. అయితే ఇక్కడ ఒక వాస్తవాన్ని గ్రహించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. వారందరినీ కాదని కొత్తగా గెలిచిన పదిమందిని తీసుకున్నారు చంద్రబాబు. అంతటి సాహస నిర్ణయం ఎవరు తీసుకోరు. అటువంటిది కొద్ది కాలంలోనే ఆ మంత్రులను మార్చితే చంద్రబాబు నిర్ణయానికి గౌరవం ఉంటుందా? కచ్చితంగా ఉండదు. అది ముమ్మాటికి ఫేక్ వార్త. అయితేవైసీపీ మాత్రం అదే పనిగా ప్రచారం చేస్తోంది.