https://oktelugu.com/

CM Chandrababu: చంద్రబాబు స్పీడు.. రేవంత్‌రెడ్డి బేజారు..!

ఏపీలో ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజు నుంచే సీఎం చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. బాధ్యతలు చేపట్టడంతోనే ఐదు ఫైళ్లపై సంతకం చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 19, 2024 / 12:50 PM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu: తెలంగాణలో ఆరు నెలల క్రితం ప్రభుత్వం మారింది. బీఆర్‌ఎస్‌ను గద్దె దించిన ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. ఇక తాజాగా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు జగన్‌ సర్కార్‌ను గద్దె దించారు. టీడీపీ నేతృత్వంతోని ఎన్‌డీఏ సర్కార్‌ను అందలం ఎక్కించారు. నారా చంద్రబాబునాయుడు మరోమారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆరు నెలల తేడాలో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. రెండు పార్టీల నేతలు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఇరువురి పాలనను పోల్చుకోవడం ఖాయం.

    చంద్రబాబు దూకుడు..
    ఏపీలో ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజు నుంచే సీఎం చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. బాధ్యతలు చేపట్టడంతోనే ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. ప్రజలకు సంబంధించి ముందుగా పింఛన్‌ పెంపు, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్స్‌పై సంతకాలు చేయడంతో ఆయావర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత తిరుమల ఈవో బదిలీతో మొదలుపెట్టి జగన్‌ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలన్నిటికీ కొమ్ముకాసిన సీఎస్‌ జవహర్‌రెడ్డితో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులందరినీ ఏరి పక్కన పెట్టేసి సమర్ధులను ఎంపిక చేసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించి అక్కడ విధించిన ఆంక్షలు, బారికేడ్లు అన్నిటినీ తొలగించి ప్రజలకు, రైతులకు సంతోషం కలిగించారు. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల తర్వాత పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు కొన్ని సూచనలు చేశారు. రాష్ట్ర ప్రజలను పీడించి వసూలు చేస్తున్న చెత్త పన్నుని నిలిపివేయించారు. ఇవన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులలో చేసినవే. రాబోయే ఒకటి రెండు నెలల్లో రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలు ప్రారంభం కాబోతున్నాయి.

    తెలంగాణలో కనిపించని దూకుడు..
    తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడిచింది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో చంద్రబాబు తరహాలో రేవంత్‌రెడ్డి దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు. ఆచితూచి ముందుకు సాగాల్సి వస్తోంది. చంద్రబాబుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ఉంది. రేవంత్‌ సర్కార్‌కు కేంద్రం నుంచి ఎలాంటి సపోర్టు లేదు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ఖజానాలో నిల్వలు లేకపోవడం కూడా రేవంత్‌ దూకుడుకు బ్రేక్‌ వేస్తున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి తెలంగాణ కన్నా అధ్వానంగా ఉంది. అయినా బాబు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకు కారణం ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ, కేంద్రం సపోర్టే కారణం. మరోవైపు చంద్రబాబు అపార అనుభవం, ప్రతీశాఖపై ఆయనకు ఉన్న పట్టు కూడా ఆయనకు ప్లస్‌ పాయింట్‌.

    పోల్చి చూస్తే ఇబ్బందే..
    తెలంగాణ ప్రజలు ఏపీ పాలనతో భవిష్యత్‌లో తప్పకుండా పోల్చి చూసుకుంటారు. ఎందుకంటే.. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు. అభివృద్ధిని చూపెట్టే కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. పెట్టుబడులను ఆకర్షించారు. ఏపీలో అభివృద్ధి లేదు కాబట్టే కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయని ప్రజలు భావించారు. ఈసారి కూడా రెండు రాష్ట్రాల పాలనను పోల్చుకోవడం ఖాయం. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి.. తన గురువు అయిన చంద్రబాబు నాయుడును మించిన నిర్ణయాలు తీసుకోవాలి. అంతకు మించిన పాలనా దక్షత ప్రదర్శించాలి. అభివృద్ధి చూపించాలి. లేదంటే.. ఇబ్బందులు తప్పవు.