CM Chandrababu: ఏ అంటే అమరావతి.. పి అంటే పోలవరం.. ఆంధ్రకు ఇప్పుడు ఇవే ఆధారం..

2019 డిసెంబర్ 17న అమరావతిపై కర్కశం ప్రదర్శించింది జగన్ సర్కార్.మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది.ఆ క్షణమే మొదలైంది అమరావతి ఉద్యమం. ఐదేళ్లపాటు నిరాకంగా సాగింది ఆ మహోన్నత ఉద్యమం.

Written By: Dharma, Updated On : June 20, 2024 6:12 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఏపీ ప్రజల ఆశలు చిగురించాయి మరోసారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం అమరావతి రాజధాని ప్రాంతాన్ని పరిశీలించారు. తన ప్రాధాన్యాలు ఏంటో స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 మధ్య ఈ రెండు ప్రాజెక్టులకే చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. నాడు సంక్షేమం కంటే ఈ రెండు ప్రాజెక్టులే కీలకమని భావించారు. వీటిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలు గుర్తిస్తారని అంచనా వేశారు. కానీ ఏపీ ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది. కానీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో అవి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాయి. చంద్రబాబు సైతం బలమైన స్లోగన్ తోఅడుగులు వేస్తున్నారు.ఏపీ అంటే ఒక రాష్ట్రం కాదని.. ఏ అంటే అమరావతి అని.. పి అంటే పోలవరం అని చెప్పుకొస్తున్నారు. తన ప్రాధాన్యత ఈ రెండు ప్రాజెక్టు లేనని తేల్చి చెబుతున్నారు.

అమరావతి.. నవ్యాంధ్ర కలల రాజధాని.. అది నగరం కాదు.. ఆంధ్రుల నిండు గౌరవం. కానీ రాజకీయాలతో అమరావతి చరిత్ర మసకబారింది. జగన్ మూడు రాజధానుల ఆలోచనతో ఐదేళ్లపాటు మోడు బారింది. అమరావతి నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా రైతులు అందించారు. అనతి కాలంలోనే అమరావతి ప్రపంచ పటంలో గుర్తింపు సాధిస్తుందని భావించారు. అన్ని రాజకీయ పార్టీల సమ్మతితో అమరావతి రాజధానిని నిర్ధారించారు. 2014 సెప్టెంబర్ 1న క్యాబినెట్ఆమోదం కూడా తెలిపారు. 2017 అక్టోబర్లో ప్రధాని చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేశారు. 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నవ నగరాల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గ్రీన్ ఫీల్డ్ సిటీకి ప్లాన్ సిద్ధమయ్యాక పనులు పరుగులు పెట్టించారు.ఒక్కో భవనం పైకి లేచింది. సింగపూర్ సంస్థలు రంగంలోకి దిగాయి. వేల మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తుంటే విద్యుత్ వెలుగుల్లో అమరపురి వెలిగిపోయింది.

2019 డిసెంబర్ 17న అమరావతిపై కర్కశం ప్రదర్శించింది జగన్ సర్కార్.మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది.ఆ క్షణమే మొదలైంది అమరావతి ఉద్యమం. ఐదేళ్లపాటు నిరాకంగా సాగింది ఆ మహోన్నత ఉద్యమం. ఆ ఉద్యమంలో ప్రతిదీ ఒక చారిత్రక ఘట్టమే. వంటిపై లాఠీలు విరిగినా వారు వెనక్కి తగ్గలేదు. వరుసగా ప్రాణాలు పోతున్నా లెక్క చేయలేదు. 29 గ్రామాల రైతులు తొలి రోజు నుంచి అదే ధైర్యంతో ఉద్యమ బాట పట్టారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట భారీ దండయాత్ర చేపట్టారు. పోలీసులతో ఉక్కు పాదం మోపినా, వైసిపి అల్లరిమూకలు కోడిగుడ్లతో దాడి చేసినా.. సహనంతో, సంయమనంతో ముందుకు సాగారు అమరావతి రైతులు. 1631 రోజులు ఉద్యమ బాట పట్టారు. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. వారి ఉద్యమ రోజుల సంఖ్య కలిపితే 11 కావడంతో మురిసిపోయారు. తమ ఉసురు తగిలి వైసిపికి 11 స్థానాలు మాత్రమే రావడాన్ని గొప్ప విషయం గా చెప్పుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశ అవసరాలు కూడా తీరగలవనే ఒక నమ్మకం ఉండేది. నదుల అనుసంధానం తో పోలవరం ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతూ వస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్.. విడిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో పట్టాలెక్కింది. అయితే పది సంవత్సరాలు అవుతున్న పూర్తికాక పోగా.. మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇదో రాజకీయ అంశంగా మారిపోయింది. పోలవరం ప్రాజెక్టును దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి ఇందిరా సాగర్ అని పేరు పెట్టారు. ఆయన అకాల మరణంతో మూలకు వెళ్ళింది ఈ ప్రాజెక్టు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడ్డాయి. 2014 నుంచి 2019 వరకు దాదాపు 72 శాతం మేర పనులు పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాలువల నిర్మాణం పూర్తి కావడంతో.. ఒకటి రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంతా భావించారు.

2019లో ఏపీలో అధికార మార్పిడి పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. వైసిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతా అంశాల్లో చేర్చలేదు. వైసిపి పాలకులు ప్రకటనలకే పరిమితం అయ్యారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని చెప్పి.. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్ కు పనులు అప్పగించింది జగన్ సర్కార్. కేంద్ర జల వనరుల శాఖ అభ్యంతరాలను లెక్కచేయకుండా ముందుకెళ్లింది. అదే సమయంలో వరదలు రావడంతో కాపర్ డ్యాం, డయాఫ్రం వాల్ దెబ్బతిన్నాయి. నాడు టిడిపి ప్రభుత్వం నాసిరకంగా పనులు చేయడం వల్లే వరదలకు ఇవి కొట్టుకుపోయాయని.. టిడిపి ప్రభుత్వం పై నేపాన్ని నెట్టేందుకు వైసిపి ప్రయత్నించింది. అంతకుమించి రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో పనులు పట్టాలెక్కుతాయని ప్రజల్లో ఆశలు చిగురించాయి.