CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) పరిస్థితికి తగ్గట్టు నడుచుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తారు. సాధారణంగా విపత్తులు, ప్రమాదాలు జరిగే సమయంలో ఆయన ఇట్టే వాలిపోతారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా బాధితులను పరామర్శించడంలో ముందుంటారు. పైగా కొన్ని సమయాల్లో సమయస్ఫూర్తిగా ఆలోచిస్తారు. అయితే తాజాగా చందనోత్సవం సందర్భంగా సింహాచలంలో గోడ కూలిన ఘటనలో 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు విశాఖ వెళ్తారని అంతా భావించారు. కానీ ఆ పని చేయలేదు చంద్రబాబు.
Also Read : జనవరిలో తిరుపతిలో..ఇప్పుడు సింహగిరిలో..ఎందుకలా
* వివాహ వేడుకలకు రేవంత్..
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy) ఏపీకి వచ్చారు. విజయవాడలో టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు వివాహ వేడుకలకు హాజరయ్యారు. వాస్తవానికి దేవినేని ఉమ చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేత. తెలంగాణ సీఎం రేవంత్ చంద్రబాబు పట్ల ఎప్పుడు అభిమాన భావంతోనే ఉంటారు. అటువంటి రేవంత్ ఏపీకి వస్తే చంద్రబాబు కచ్చితంగా కలుస్తారు. పైగా టిడిపి నేత కుమారుడి వివాహం కావడంతో కచ్చితంగా చంద్రబాబు కచ్చితంగా హాజరు కావాల్సిందే. కానీ నిన్న సింహాచలంలో జరిగిన ఘటన నేపథ్యంలో వివాహ వేడుకలకు దూరంగా ఉన్నారు. తన బదులు కుమారుడు, మంత్రి లోకేష్ ఆ వివాహ వేడుకలకు హాజరయ్యారు.
* భక్తులకు అవస్థల దృష్ట్యా
ఏపీ సీఎం చంద్రబాబు సింహాచలంలో( Simhachalam) ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉంటే చాలా రకాలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చందనోత్సవం కావడంతో లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అటువంటి సమయంలో చంద్రబాబు అక్కడకు వెళ్లి ఉంటే భద్రతా కారణాలతో.. భద్రతను కట్టుదిట్టం చేస్తారు. భక్తులకు తీవ్ర అసౌకర్యం తప్పదు. అందుకే చంద్రబాబు చివరి నిమిషంలో విశాఖ సింహాచలం వెళ్లలేదని తెలుస్తోంది. అదే సమయంలో దేవినేని ఉమా కుమారుడి వివాహానికి హాజరై ఉంటే రకరకాల విమర్శలు వచ్చేవి. ప్రజలు బాధల్లో ఉంటే ఇలా వివాహ వేడుకలా? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది. ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారేది. అందుకే చంద్రబాబు రెండు కోణాల్లో ఆలోచించి అటు సింహాచలం వెళ్లలేదు. ఇటు దేవినేని ఉమా కుమారుడి వివాహానికి హాజరు కాలేదు.
* ఇప్పటికే వ్యతిరేక ప్రచారం..
సాధారణంగా ఇటువంటి విపత్తులు, ప్రమాదాలు ప్రతిపక్షానికి ప్రచార అస్త్రంగా మారుతాయి. తప్పకుండా అలా మార్చుతారు కూడా. ఇప్పుడు సింహాచలం ఘటన విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పిదం అంటూ వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వం పై వ్యతిరేక ప్రచారం నడుస్తోంది. అందుకే ఇంకా విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని ఏపీ సీఎం చంద్రబాబు భావించారు. అందుకే సింహాచలం రాలేదని టిడిపి వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.