Jagan Mohan Reddy : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి పూనుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా అమరావతి సభకు అందర్నీ ఆహ్వానిస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డికి సైతం ప్రత్యేక ఆహ్వానం పంపారు. అయితే ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.
Also Read : అందుకే సింహాచలం వెళ్ళని సీఎం చంద్రబాబు!
* అమరావతికి కొత్త కళ
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో అమరావతి రాజధాని నిర్వీర్యం అయిన సంగతి తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకారం అందుతోంది. నిధుల సమీకరణ సైతం భారీ స్థాయిలో జరిగింది. అందుకే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి పూనుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సైతం ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి ఫజల్ స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి లేకపోవడంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానం పంపడంతో జగన్మోహన్ రెడ్డి హాజరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.
* మెజారిటీ శ్రేణుల మొగ్గు
అయితే ఎక్కువ మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress )శ్రేణులు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు హాజరుకావాలని సూచిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. కానీ దానికి ప్రజల నుంచి మద్దతు లభించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టం చేసింది. కూటమికి ప్రజలు మద్దతుగా నిలిచారు. ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరవుతున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించడం ద్వారా ప్రభుత్వం పై చేయి సాధించింది. అందుకే జగన్ హాజరుకావాలని.. అలా చేస్తేనే జగన్ పై అమరావతి విషయంలో జరుగుతున్న వ్యతిరేకతకు ఫుల్ స్టాప్ పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా జగన్ మోహన్ రెడ్డి సైతం అమరావతి రాజధాని నిర్మాణానికి మద్దతు తెలిపినట్లు అవుతుంది. అందుకే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తర్జన భర్జన నడుస్తోంది.
* నేతల అభిప్రాయం తెలుసుకునే పనిలో..
ఆహ్వాన పత్రిక అందడంతో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) పార్టీ శ్రేణులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ముఖ్య నేతలతో చర్చించనున్నారు. ప్రస్తుతం జగన్ అమరావతిలో జరుగుతున్న టెండర్ల వ్యవహారంపై ఆరోపణలు చేస్తున్నారు. రాజధానిగా అమరావతి మాత్రమే ఉండడం ఖాయం. భవిష్యత్తులో మార్పులు చేయలేని విధంగా ఏకంగా పార్లమెంటులో సైతం చట్టం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అమరావతిని వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు హాజరు కావడం ద్వారా.. అమరావతికి మద్దతుగా జగన్ సైతం అన్నట్టు పరిస్థితి మారే అవకాశం ఉంది. మరి హాజరుపై తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..