CID Raids: జగన్ కి ఫస్ట్ షాక్

వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ చైర్మన్ గా వాసుదేవ రెడ్డి వ్యవహరించారు. మద్యం పాలసీలను తయారు చేయడం, ప్రభుత్వ మద్యం దుకాణాలకు నాసిరకం మద్యం పంపిణీ చేయడం, మద్యం కంపెనీలతో డీల్ వంటి విషయాల్లో వాసుదేవ రెడ్డిదే క్రియాశీలక పాత్ర అన్న ఆరోపణలు ఉన్నాయి.

Written By: Dharma, Updated On : June 8, 2024 12:10 pm

CID Raids

Follow us on

CID Raids: మాజీ సీఎం జగన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఏపీ ప్రజలు దారుణ పరాజయాన్ని ఇచ్చి షాక్ ఇచ్చారు. ఇంకా కొలువు దీరకముందే కొత్త ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపుతోంది. ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాక తప్పదని తేలుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లుగా తీసుకున్న ప్రతి నిర్ణయం పై సమీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం పై కొత్త ప్రభుత్వం కచ్చితంగా దృష్టి సారిస్తుంది. ఇప్పటికే దీనిపై కార్యాచరణ ప్రారంభం అయ్యింది.

వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ చైర్మన్ గా వాసుదేవ రెడ్డి వ్యవహరించారు. మద్యం పాలసీలను తయారు చేయడం, ప్రభుత్వ మద్యం దుకాణాలకు నాసిరకం మద్యం పంపిణీ చేయడం, మద్యం కంపెనీలతో డీల్ వంటి విషయాల్లో వాసుదేవ రెడ్డిదే క్రియాశీలక పాత్ర అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి తనిఖీలు చేసింది. కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. సిఐడి ఈ విషయంలో పట్టు బిగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. సొంతంగా ప్రభుత్వం దుకాణాలను ఏర్పాటు చేసింది. అయితే అంతకుముందు ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నిషేధం అంటూ జగన్ ప్రకటించారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏటా 25% షాపులు తగ్గించి.. నాలుగు సంవత్సరాలలో మద్య నిషేధం వైపు అడుగులు వేస్తామని జగన్ ప్రకటించారు. కానీ అమలు చేయలేకపోయారు. దేశంలో ఎక్కడా కనిపించని మద్యం బ్రాండ్లను తీసుకొచ్చారు. ధరలను అమాంతం పెంచేశారు. నగదు రహిత లావాదేవీలు జరపలేదు. అంతా నగదు తోనే క్రయవిక్రయాలు జరిగాయి. భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం విషయంలో భారీ కుంభకోణాలు జరిగాయని విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ లు ఆరోపించారు.

గత ఐదేళ్లుగా మద్యం అమ్మకాలు లక్షల కోట్లలో జరగగా.. వాటిని వేల కోట్లలో చూపించారని.. మద్యం పేరుతో వైసిపి నేతలు భారీ దందాకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గతంలో చంద్రబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే బేవరేజెస్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేయడంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ కు స్పష్టమైన సంకేతాలు పంపించినట్లు అయ్యింది. ఏ సీఐడీతో తనను అరెస్టు చేయించారో.. ఏ సిఐ డితో తనతో ఆడుకున్నారో.. అదే సిఐడితో చంద్రబాబు జగన్ ను వెంటాడనున్నారు.