Vizag Mayor: గ్రేటర్ విశాఖ పీఠం టిడిపి చేతిలోకి

2021లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను వైసిపి కైవసం చేసుకుంది. టిడిపి ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీకి పరిమితం అయింది.

Written By: Dharma, Updated On : June 8, 2024 12:02 pm

Vizag Mayor

Follow us on

Vizag Mayor: ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ విజయం నమోదు చేసుకుంది. వైసిపి కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీలో ఒక రకమైన అలజడి రేగింది. చాలామంది నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు కూటమి పార్టీలతో ఒక సర్దుబాటు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థలు ఏకపక్షంగా వైసీపీ వైపు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ప్రతినిధులు టిడిపి కూటమి వైపు చూడడం ప్రారంభించారు. అందులో భాగంగా విశాఖ నగరపాలక సంస్థ టిడిపి చేతిలోకి రానుంది అన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది అసంతృప్తులతో విశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీఠం టిడిపి సొంతం చేసుకుంటుందన్న టాక్ నడుస్తోంది. అదే జరిగితే ఒక సంచలనమే. మిగతా ప్రాంతాల్లో స్థానిక సంస్థలు టిడిపి కూటమి వశమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

2021లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను వైసిపి కైవసం చేసుకుంది. టిడిపి ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీకి పరిమితం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు సైతం వైసిపి వశమయ్యాయి. అయితే అప్పట్లో విశాఖ నగరపాలక సంస్థను వైసిపి అనూహ్యంగా సొంతం చేసుకుంది. 100 డివిజన్లకు గాను.. 52 చోట్ల విజయం సాధించింది. టిడిపి 29 చోట్ల గెలిచింది. జనసేన మూడు చోట్ల, సిపిఐ, సిపిఎం, బిజెపి ఒక్కోచోట, ఇండిపెండెంట్లు ఐదుచోట్ల విజయం సాధించారు. అప్పట్లో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం ప్రభావితం చేస్తుందని అంతా భావించారు. కానీ వైసీపీ పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడ ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని భావించింది. అందుకు తగ్గట్టుగానే సర్వశక్తులు ఒడ్డింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టిడిపి కూటమి వైట్ వాష్ చేసింది. అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. వైసిపి కార్పొరేటర్లు 25 మంది వరకు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏకపక్ష విజయాలతో వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు ఆందోళనతో ఉన్నారు. వారి పదవీకాలం 2026 వరకు ఉంది. అధికార పార్టీ మద్దతు లేకుండా మనుగడ అసాధ్యమని వారికి తెలుసు. అందుకే వారు కూటమి వైపు మొగ్గు చూపుతారు. విశాఖలో కూడా సీన్ మారుతోంది. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన మరుక్షణం వైసిపి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున టిడిపిలో చేరడం ఖాయంగా తెలుస్తోంది. అదే జరిగితే గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ పై టిడిపి జెండా ఎగురవేయడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఇది ఒక్క జీవీఎంసీతోనే ఆగదు. మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ లు , మండల పరిషత్ ల్లో అధికార మార్పిడి కానీ, పార్టీ మార్పిడి కానీ స్పష్టంగా పూర్తవుతుంది.