YS Jagan : మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఇప్పటికే కడపకి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇడుపులపాయకు వెళ్లి అక్కడ తన తండ్రి సమాధి వద్ద తన తండ్రికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆయన ఇలా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన జగన్ అనంతరం ప్రేయర్ హాల్‌లో జరిగిన ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. మధ్యాహ్నం ఇడుపుల పాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రి పులివెందులలో బస చేస్తారు.
ఇక క్రిస్మస్ పండుగ సందర్భంగా జగన్ కడప పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్ 25న ఈయన పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. ఇలా క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని ఆరోజు మొత్తం కుటుంబంతోనే ఉండి పలు కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. ఇక 26వ తేదీ పులివెందులలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. తెల్లారి అంటే ఈ నెల 27 న ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి టూర్ షెడ్యూల్. వీటిన్నింటి నడుమ నేడు కుటుంబం మొత్తంతో కలిసి దిగిన చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూతురుతో కలిసి కొడుకును విబేధించిన తల్లి విజయమ్మ కూడా ఇప్పుడు జగన్ తో పాటే ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కుటుంబం అంతా ఉన్నప్పటికీ షర్మిల ఆ కుటుంబంతో లేదు.
రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువులు.. ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోయారు. ఎంతలా అంటే కనీసం పుట్టినరోజు నాడు కూడా శుభాకాంక్షలు చెప్పుకోలేనంత ఆజన్మ శత్రువులుగా మారిపోయారు. జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిల.. ఒకే నెలలో జన్మించిన ఈ అన్నా చెల్లెళ్లు వారి బర్త్ డేలకు కూడా పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోలేని దుస్థితి ఏర్పడింది. చెల్లి బర్త్‌డేకు అన్న.. అన్న జన్మదినం రోజు చెల్లి శుభాకాంక్షలు చెప్పుకోలేదు. ఈ వార్త ఇటు రాజకీయంగా అటు సామాన్యుల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ మోహన్ రెడ్డి జన్మదినం డిసెంబర్ 21వ తేదీ. వైఎస్ షర్మిల పుట్టిన తేదీ 17 డిసెంబర్. నాలుగు రోజుల వ్యవధిలో జన్మించిన అన్నాచెల్లెళ్లు ఎంతో ప్రేమగా ఉండేవారు. జగనన్న కష్టాలను తన కష్టాలుగా భావించి పార్టీని.. రాజకీయాలను భుజానకెత్తుకుని గతంలో పనిచేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి కారణం షర్మిల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయంగానే కాదు కుటుంబపరంగా బద్ద శత్రువులుగా మారిపోయారు. ఆస్తుల పంచాయితీ ఈ అన్నాచెలెళ్లను విడగొట్టిన విషయం తెలిసిందే. ఈ పంచాయితీలో వారి తల్లి కూడా జగన్ నుంచి విడిపోయిన కూతురు పంచన చేరిన సంగతి తెలిసిందే.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్, షర్మిల మధ్య విభేదాలు కొంచెం కొంచెంగా రాసుకుని అగ్నిగుండంగా మారిపోయాయి. ఈ ఏడాది ఒక్కసారిగా బద్ధలయ్యాయి. ఇప్పుడు సొంత చెల్లి, తల్లిపైనే జగన్ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చిన పుట్టినరోజుల నాడు జగన్, షర్మిల పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోలేదు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ రోజు సైతం తల్లి కొడుకు వద్దకు చేరింది కానీ.. షర్మిల మాత్రం అన్న వద్దకు రాలేదు. పంతం వీడలేదని వారి ప్రత్యర్థులు చెబుతున్నారు. రాజకీయంగా.. కుటుంబపరంగా ఎన్ని భేదాభిప్రాయాలు.. కొట్లాటలు ఉన్నా పండుగల సమయంలో విష్ చేసుకుంటే పెద్ద సమస్య కూడా చిన్నగా మారిపోయే అవకాశం ఉందని వైఎస్ కుటుంబ అభిమానులు భావిస్తున్నారు.