Chevireddy Bhaskar Reddy : జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రకాశం జిల్లా పై ఫోకస్ పెట్టారా? అక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి సారించరా? వై వి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదు. ఇప్పటివరకు సారధ్య బాధ్యతలు చూస్తూ వచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిపోయారు. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి నష్టం కలిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూపంలో నాయకత్వం దొరికినా.. ఆయన స్థానికేతరుడు అన్న ముద్ర ఉండడంతో ప్రభావం చూపలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రయోగించారని ప్రచారం జరుగుతోంది.
Also Read : థియేటర్ల బంద్ వెనుక ఆ నలుగురు.. విచారణకు మంత్రి ఆదేశం!
* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తన తోడల్లుడు వై వి సుబ్బారెడ్డికి సమీప బంధువు కావడంతో బాలినేనిని ప్రోత్సహించారు. 2004లో తొలిసారిగా టిక్కెట్ ఇచ్చారు. అసెంబ్లీలో అడుగుపెట్టిన బాలినేని 2009లో కూడా గెలిచారు. దీంతో రాజశేఖర్ రెడ్డి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. అలా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రి అయ్యారు బాలినేని. అయితే జగన్మోహన్ రెడ్డి కోసం మంత్రి పదవిని వదులుకొని మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో పార్టీ అధికారంలోకి రావడంతో క్యాబినెట్లో స్థానం కల్పించారు బాలినేనికి జగన్మోహన్ రెడ్డి. కానీ మంత్రివర్గం నుంచి తొలగింపు నుంచి అసంతృప్తికి గురైన బాలినేని.. ఎన్నికల అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు.
* ఉమ్మడి జిల్లా పై ప్రభావం..
కాంగ్రెస్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ లో కీరోల్ ప్లే చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balini Srinivasa Reddy ).. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విశేష ప్రభావం చూపుతూ వచ్చారు. అటువంటి బాలినేని పార్టీకి గుడ్ బై చెప్పడంతో నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అనూహ్య పరిస్థితుల్లో 2024లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బాలినేని వెళ్లిపోవడంతో ప్రకాశం జిల్లా బాధ్యతలను ఆయనే చూస్తున్నారు. అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో వైవి సుబ్బారెడ్డి రావడం ఖాయమని ప్రచారం సాగుతోంది.
* రాజ్యసభలో వైసిపి పక్ష నేతగా..
వై వి సుబ్బారెడ్డి( YV Subba Reddy) ఉత్తరాంధ్ర నియోజకవర్గ బాధ్యతలను చూసుకునేవారు. అయితే ఆ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ స్థానంలో విజయసాయి రెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్. అదే సమయంలో రాజ్యసభలో వైసిపి పక్ష నేతగా వైవి సుబ్బారెడ్డి కి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సొంత జిల్లా ప్రకాశం బాధ్యతలను తన బాబాయికి కట్టబెడుతున్నారు జగన్. మరి ఆయన నియామకంతోనైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? లేదా? అన్నది చూడాలి.