Overconfidence Hurt KCR And Jagan: అధికారం ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదు. కానీ.. అధికారంలో ఉన్నప్పుడు ఆ సూత్రాన్ని ఎవరూ పాటించరు. భవిష్యత్తులోనూ తమదే అధికారం అన్నట్లుగా రెచ్చిపోతుంటారు. నేను చేసిందే చట్టం.. నేను చెప్పిందే శాసనం.. నాదే ప్రభుత్వం.. అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. గత పదేళ్లు తెలంగాణ కేసీఆర్, గత ఐదేళ్లు ఏపీలో జగన్ ఇలానే రెచ్చిపోయారు. మళ్లీ తమదే అధికారం అని ఇష్టారీతిన పాలన సాగించారు. ఇప్పుడు వాటి ఫలితాలను అనుభవిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఈ ఇద్దరికి ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. ఇద్దరినీ అధికారం నుంచి దింపేశారు. ఏపీలో జగన్ కొమ్ములు విరిచారు. కేసీఆర్ నోరు నొక్కారు.
అయితే.. పదేళ్ల అధికారం ఎక్కడ చేజారిపోతుందేమో అన్న భయం కావచ్చు.. లేదంటే దశాబ్దం పాటు తెలంగాణలో ఆధిపత్యంతో వచ్చిన మితిమీరిన ఆత్మవిశ్వాసం కావచ్చు.. పార్టీ పుట్టుకకు, వచ్చిన పదవులకు భీజం వేసిన ప్రాంతీయ వాదానికి కేసీఆర్ చెక్ పెట్టారు. ప్రాంతాయ వాదాన్ని విడిచి పార్టీ పేరును మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన పార్టీ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. దాంతో ప్రజలు కూడా పార్టీని అక్కున చేర్చుకొని కేసీఆర్‌కు పదవులు అప్పగించారు. సెంటిమెంటును కాదని దేశ రాజకీయాల్లో సత్తా చాటాలని ఉబలాటపడ్డారు. చివరకు పార్టీకి బీఆర్ఎస్‌గా నామకరణం చేశారు. భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. దీంతో అప్పటి నుంచి పార్టీ మీద ప్రజల్లో సెంటిమెంటు పోయినంత పని అయింది. ఓ ఊపు ఊపిన పార్టీ కాస్త తానే బ్రేకులు వేసుకున్నారు.
ఇక.. కేసీఆర్ స్వకృపరాధం ఇలా ఉంటే.. జగన్ విధానం మరోలా కనిపిస్తోంది. ఐదేళ్ల అధికారం తలకెక్కడంతో.. ఇక ఆయనే శాశ్వత ముఖ్యమంత్రి అని అనుకున్నారు. తన పార్టీకి తానే రాజు అనుకున్న జగన్.. వైసీపీకి ప్రతిబింబంగా ఉండే సాక్షి లోగోను మార్చేశాడు. మొన్నటిదాక తన తండ్రి వైఎస్ బొమ్మతో నడిచే సాక్షి నుంచి వైఎస్సార్ బొమ్మను పూర్తిగా కనుమరుగు చేశారు. వైఎస్సార్ విగ్రహాలతో రాజకీయం మొదలు పెట్టిన జగన్.. అధికారం చేతికి వచ్చే వరకు తండ్రి లేని బిడ్డగా, చెల్లిని వెంటేసుకొని తిరిగాడు. అధికారం చేతికి రాగానే తల్లిని, చెల్లిని దూరం పెట్టాడు. ఇక వై నాట్ 175 నినాదంతో అందుకొని.. వైఎస్సార్ బొమ్మను తీసేశాడు. 30 ఏళ్లపాటు తనదే అధికారం అనుకున్న జగన్.. ఇక వైఎస్ బొమ్మతో పని ఏముందని అనుకున్నాడు. దాంతో వైఎస్ బొమ్మను తీసేశాడు. తండ్రి విగ్రహాలను అడ్డుపెట్టుకొని రాజకీయంగా ఎదిగిన జగన్.. ఆ తర్వాత వైఎస్ బొమ్మనే లేకుండా చేశాడు. దీంతో గతంలో 151 సీట్లు సాధించిన ఆయన, ఆయన పార్టీ 11 సీట్లకు పరిమితం కావాల్సివ చ్చింది. ఇక తెలంగాణ వాదంతో ఎదిగిన కేసీఆర్ తెలంగాణ అనే పదాన్నే పక్కన పెట్టారు. అటు జగన్ వైఎస్ బొమ్మను తొలగించారు. చివరికి ఈ ఇద్దరు సాధించింది ఏంటయా అంటే.. అధికారాలను కోల్పోవడమే అన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.