Chandragiri panchayathi EO : ఏసీబీ (ACB) అనే వ్యవస్థ పుట్టిన దగ్గరనుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎన్నో దాడులు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. లంచాలకు మరిగిన అధికారులు.. అప్పుడప్పుడు దొరుకుతుంటారు. కొందరు తమ తీరు మార్చుకుంటే.. మరికొందరు తమకున్న రాజకీయ పలుకుబడితో మళ్ళీ అదే స్థానంలో పోస్టింగ్ సంపాదిస్తారు. గతంలో కంటే ఎక్కువగా లంచాలు వసూలు చేస్తారు. ఒకరకంగా రాజకీయ నాయకులు.. ప్రభుత్వ అధికారులు సయామీ కవలల లాంటి వాళ్ళు. వారిని వీరు రక్షిస్తుంటారు.. వీరిని వారు కాపాడుతుంటారు. మొత్తంగా ఇద్దరు కలిసి జనం మీద పడి దోచుకుంటుంటారు. ఏసీబీ అధికారులు లంచాలు తీసుకునే అధికారుల మీద మీద దాడులు చేయడం సర్వసాధారణం. అధికారంలో ఉన్న ప్రభుత్వం కాస్త ఎక్కువ చొరవ చూపితే ఏసీబీ అధికారులు ఎక్కువగా దాడులు చేస్తుంటారు. కాదు కూడదు అనుకుంటే.. అమావాస్య లేదా పున్నానికి ఒక దాడి చేసి మమ అనిపించుకుంటారు.. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీలో మాత్రం ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయే పరిస్థితి ఎదురైంది. ఇంతకీ ఏసీబీ అధికారులకు అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురయిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read : బట్టలూడదీస్తావా? జగన్ జాగ్రత్తగా మాట్లాడు.. ఎస్ఐ మాస్ వార్నింగ్!
ఆస్తులు ఏకంగా 85 కోట్లు
తిరుపతి.. ఈ పేరు చెప్తే నిత్య కళ్యాణం పచ్చ తోరణం గుర్తుకు వస్తుంది. తిరుపతి మాత్రమే కాదు, తిరుపతికి సమీపంలో ఉన్న మండలాలు కూడా భక్తులతో నిత్యం కిటకిటలాడుతూనే ఉంటాయి. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి అనే పంచాయతీ ఉంది. ఇది తిరుపతికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం కూడా జోరుగా సాగుతూ ఉంటుంది. ఇక్కడ చంద్రగిరి పంచాయతీ ఈవోగా మహేశ్వరయ్య అనే అధికారి పనిచేస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో అతడు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఒక పని నిమిత్తం 50,000 డిమాండ్ చేసిన మహేశ్వరయ్య.. సదరు వ్యక్తి నుంచి ఆ 50,000 తీసుకుంటుండగా ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాటి చేయడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో అప్పటినుంచి అతడు ఏసీబీ జైల్లో ఉన్నాడు. అతడి కేసు కు సంబంధించి అధికారులు దర్యాప్తు మొదలుపెట్టగా దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మహేశ్వరయ్య తన కుటుంబంతో కలిసి తిరుపతికి సమీపంలోని పేరూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అక్కడ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరయ్యకు ఉన్న ఆస్తులు ఒకసారిగా బయటపడ్డాయి. బెంగళూరులో పది కోట్ల విలువైన బహుళ అంతస్తుల భవనం, పలమనేరు ప్రాంతంలో మూడు అంతస్తుల ఇల్లు, వ్యవసాయ క్షేత్రం, బద్వేల్ ప్రాంతంలో విలువైన భూములు, ఇవి మాత్రమే కాక భారీగా బంగారం నిలువలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఇంకా చాలా ఆస్తులు తెలియాల్సి ఉందని ఏసీబీ అధికారులు అంటున్నారు. మొత్తంగా ఇప్పటివరకు మహేశ్వరయ్య ఆస్తుల విలువను లెక్కగడితే 85 కోట్లుగా తేలిందని ఎసిబి అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మహేశ్వరయ్య పని చేసిన పలు ప్రాంతాల్లోనూ అవినీతి అధికారిగా ముద్రపడ్డాడు. అయితే తనకున్న రాజకీయ బలంతో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకున్నాడు. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.
Also Read : పోసానికి మళ్లీ నోటీసులు.. కొత్తగా ఆ కేసు!