CM Chandrababu: ఇండియాకు చెందిన గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. చిన్న వయసులోనే ఈ ఘనత సాధించాడు. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్గా అవతరించి చెస్ ప్రపంచంలోనే సరికొత్త అధ్యయనాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. టైటిల్ సాధించిన తర్వాత గుకేష్ భావోద్వేగానికి గురయ్యాడు. చెస్ రంగంలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దశాబ్దాల కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించిన గుకేశ్ కు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చాలామంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గుకేష్ ఏపీకి చెందిన వ్యక్తి కావడం గర్వకారణంగా అభివర్ణించారు. అక్కడ నుంచి రచ్చ ప్రారంభం అయింది. దీనిపై తమిళులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దొమ్మిరాజు గుకేష్ తమ వాడిగా చెబుతున్నారు.
* చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం
గుకేష్ ది చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం. వారిది తిరుపతి జిల్లాకు చెందిన గ్రామీణ నేపథ్యం. తండ్రి రజనీకాంత్ స్వస్థలం సత్యవేడు సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్ర. ఆయన తన వైద్య వృత్తి కోసం చెన్నై వెళ్లారు. అక్కడే గుకేష్ పుట్టాడు. తాత శంకర్ రాజు ఇప్పటికీ సొంత ఊరు చెంచు రాజు కండ్రలోనే నివాసం ఉంటున్నారు. ఆ ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు ఆయనను అభినందిస్తూ ట్విట్ చేశారు. దీనిపై తమిళనాడు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
* ప్రాంతీయ అభిమానం అధికం
తమిళనాడు వాసులకు ప్రాంతీయ అభిమానం అధికం. అందుకేవారు చంద్రబాబు ట్వీట్ పై స్పందిస్తున్నారు. వరల్డ్ చెస్ గ్రాండ్ మాస్టర్ గా గుకేష్ నిలవడంపై తమిళనాడు వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆయన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలిసినా.. అందుకు ఒప్పుకోవడం లేదు. చెన్నైలో స్థిరపడ్డారు కనుక వారు తమిళులు అని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి అయితే ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారడం విశేషం. దీనిపై గ్రాండ్ మాస్టర్ గుకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.