Chandrababu Thalliki Vandanam Scheme: తల్లికి వందనం( Thalliki Vandanam ) పథకంపై రోజుకో వార్త బయటకు వస్తోంది. మార్గదర్శకాలు ఇవి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా తల్లికి వందనం నిధుల విడుదలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలపై స్పష్టత ఇచ్చారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని.. కావాలని కొంతమంది సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కీలక సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్న దృష్ట్యా ప్రజల్లో వాటిపై ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు.
* ఈనెల 14 లోపు జమ
ఈ నెల 12 నుంచి విద్యాసంస్థలు( Educational Institute ) తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాఠశాలలు తెరుచుకునే క్రమంలో తల్లిదండ్రులకు పెట్టుబడులు తప్పేలా లేవు. అందుకే ఎక్కువ మంది తల్లికి వందనం నిధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ సాయంతో కొంత ఉపశమనం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో తల్లికి వందనం నిధులు విడుదలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 12 లేదా 14వ తేదీ లోపు తల్లికి వందనం నగదు తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు పార్టీ నేతలకు తెలియజేశారు. దీంతో దీనిపై క్లారిటీ వచ్చినట్లు అయింది.
* అన్నదాత సుఖీభవ అప్పుడే
మరోవైపు అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకం విషయంలో కూడా సీఎం చంద్రబాబు పార్టీ నేతలు వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ నిధులు సైతం జమ చేస్తామని చెప్పినట్లు సమాచారం. కేంద్రం అందించే 6000 రూపాయలకు తోడు 14 వేల రూపాయలు జతచేస్తూ.. 20వేల రూపాయలు అందిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ ఈనెల 20న అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అదేరోజు అన్నదాత సుఖీభవ తొలి విడత 5వేల రూపాయలను జత కలిపి.. 7వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
* మహిళలకు ఉచిత ప్రయాణం
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో( RTC) ఉచిత ప్రయాణం అమలు చేస్తామని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా పరమైన అనుమతులు ఇచ్చామని.. వీటి ద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు వివరించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరించాలని కూడా సూచించారు సీఎం చంద్రబాబు. మొత్తానికైతే కీలకమైన పథకాల విషయంలో స్పష్టతనిచ్చారు.