Palla Simhachalam Passes Away: ఏపీ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు( తండ్రి, మాజీ ఎమ్మెల్యే సింహాచలం( Palla Simhachalam ) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో 86 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పల్లా సింహాచలం మృతి పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. పల్లా శ్రీనివాసరావు తో ఫోన్లో మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
* విశాఖ రాజకీయాల్లో ప్రత్యేకం
పల్లా సింహాచలం విశాఖ( Visakhapatnam) రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కార్మిక సంఘం ప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా విశాఖ ప్రజలకు సేవలు అందించారు. నగరం అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు. అనేకసార్లు గాజువాక సర్పంచ్ గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఎక్కువ రోజులు అక్కడే పని చేశారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు పల్లా శ్రీనివాసరావు. అంచలంచలుగా ఎదుగుతూ రాష్ట్ర అధ్యక్ష పదవి పొందారు.
* తండ్రి వారసత్వంగా..
1989లో పెందుర్తి( Pendurthi) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సింహాచలం కు ఓటమి ఎదురైంది. కానీ 1994లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అటు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పల్లా శ్రీనివాసరావు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టిడిపిలో చేరి 2014లో గాజువాక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు శ్రీనివాసరావు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. దీంతో చంద్రబాబు పల్లా శ్రీనివాసరావుకు టిడిపి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
* మంత్రుల సంతాపం..
పల్లా సింహాచలం మృతి పై మంత్రులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్( Nara Lokesh), నాదెండ్ల మనోహర్ సంతాపం తెలిపారు. సింహాచలం భౌతిక కాయాన్ని కేంద్రమంత్రికి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. నివాళులు అర్పించారు. ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ సైతం సంతాపం తెలిపి.. శ్రద్ధాంజలి ఘటించారు.