Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Swethapatram : ఏపీలో భూదందాలు, కబ్జాలు.. నాలుగో శ్వేత పత్రంలో చంద్రబాబు చెప్పే నిజాలు...

Chandrababu Swethapatram : ఏపీలో భూదందాలు, కబ్జాలు.. నాలుగో శ్వేత పత్రంలో చంద్రబాబు చెప్పే నిజాలు ఇవే!

Chandrababu Swethapatram :  ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు సీఎం చంద్రబాబు. గత వైసిపి హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగంలోని సంక్షోభం.. ఇలా మూడు శ్వేత పత్రాలు విడుదల చేశారు చంద్రబాబు. ఈరోజు మరో శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 4వ శ్వేత పత్రం విడుదల చేయబోతున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేత పత్రం విడుదల చేస్తారు. దీంతో అంత ఆసక్తికరంగా మారింది.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. భారీగా భూదందా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గృహ నిర్మాణం పేరిట పెద్ద ఎత్తున భూములు సమీకరించారు. నిరుపేదలకు సెంటున్నర స్థలం చొప్పున కేటాయింపులు చేశారు. అయితే ఊరి చివర్లో, పనికిరాని స్థలాలను అధిక ధరలకు చెల్లించి కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి చోట కొండలు, ప్రభుత్వ భూములు చదును చేసి.. ప్రభుత్వ అవసరాల పేరిట పక్కదారి పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. భూదందా ఆరోపణలు వచ్చాయి. ఆ నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం అన్న తేడా లేకుండా.. ఎక్కడి పడితే అక్కడ భూ ఆక్రమణలు, కబ్జాల పర్వం నడిచింది అన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

అమరావతి రాజధాని నిర్మాణానికి నాడు చంద్రబాబు 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్. అందులో ఆర్ 5 జోన్ కీలకం. అది ఒక విధంగా చెప్పాలంటే వాణిజ్య అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కానీ అమరావతిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన జగన్.. ఆర్ 5 జోన్ లో దాదాపు 900 ఎకరాలను పేదల ఇంటి స్థలాల కోసం కేటాయించారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల లబ్ధిదారులకు అందజేశారు. అక్కడ కూడా భారీగా భూ అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల బినామీలు ఆ భూములను కొల్లగొట్టారు అన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీనిపై సైతం శ్వేత పత్రంలో చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది.

వైసీపీ సర్కార్ విశాఖను పాలన రాజధానిగా ప్రకటించింది. అంతకుముందే వైసిపి పెద్దలు విశాఖ నగరం పై వాలిపోయారు. పెద్ద ఎత్తున భూ దందాకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విజయసాయిరెడ్డి కోసం భోగాపురం ఇన్నర్ రింగ్ రోడ్డు నమూనానే మార్చేశారన్న విమర్శలు ఉన్నాయి. పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు భూములు పోగేసుకున్నారని.. బినామీల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారని.. ప్రతి శుక్రవారం విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల రిజిస్ట్రేషన్ల కోసమే.. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేసేవని ఆరోపణలు ఉన్నాయి. ఈ దందా సైతం శ్వేత పత్రంలో బయటపడే అవకాశం ఉంది.

విశాఖలో ఒక విజయసాయి రెడ్డి కాదు. ఆయన తర్వాత ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమితులైన వైవి సుబ్బారెడ్డి సైతం భారీ భూదోపిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. విశాఖ ఎంపీ ఎం వివి సత్యనారాయణ బిల్డర్ గా ఉండేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఆయన సైతం భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మాజీ సిఎస్ జవహర్ రెడ్డి కుటుంబ సభ్యుల భూదందా కూడా భారీగా జరిగిందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఉత్తరాంధ్రలో వేల ఎకరాల భూములు బినామీల పేరిట సొంతం చేసుకున్నారని జనసేన నేతలు ఆరోపణలు చేశారు. కేవలం విశాఖ తో పాటు ఉత్తరాంధ్రలోనే వేల ఎకరాల భూ దోపిడీ జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. వీటన్నింటిపై కూడా శ్వేత పత్రంలో చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.

ఎన్నికలకు ముందు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదం అయింది. తీవ్ర విమర్శలకు దారితీసింది. వైసిపి పరాజయానికి కూడా ఇదే కారణంగా మారింది. అటువంటి యాక్ట్ ను రద్దు చేశారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్యతాంశంగాభావించి.. ఆ ఫైల్ పైనే సంతకం చేశారు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వైసీపీ ఏం ఆశించింది? ఎందుకోసం ఈ యాక్ట్ రూపొందించింది? చంద్రబాబు శ్వేత పత్రం ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. అందుకే ఈ శ్వేత పత్రం కోసం రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version