Peddireddy Ramachandra Reddy : వైసీపీకి కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఏపీలో కూటమి గెలిచిన తర్వాత వైసీపీకి అన్ని విషయాల్లో మొండి చేయి దక్కుతోంది. తాజాగా ఓ విషయంలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చేందుకు అంగీకరించలేదు. కానీ ఇప్పుడు జగన్ కు అత్యంత దగ్గరైన నేతకు పదవి ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.సీఎం, క్యాబినెట్ మంత్రుల తర్వాత కీలకమైన పదవిగా పరిగణించేది చైర్మన్. ప్రభుత్వం పెట్టే ప్రతి ఖర్చును సమీక్షించే అధికారం ఈ ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ కు ఉంది. అయితే ఈ పదవిని విపక్షాలకు విడిచిపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా వైసీపీ నుంచి ఓ సీనియర్ ఎమ్మెల్యేకు పిఎసి చైర్మన్ గా అవకాశం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం వైసీపీ అభిప్రాయాన్ని కోరింది. దీంతో జగన్ ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నామినేట్ చేశారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు సమాచారం. అదే జరిగితే పిఎసి చైర్మన్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడం లాంఛనమే.
* వైసీపీకి ఒకరిద్దరు మాత్రమే
అసెంబ్లీ ప్రజాపద్ధుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటారు. ఇందులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉంటుంది. అయితే వీరు ఎన్నిక కోసం ప్రస్తుత లెక్కల ప్రకారం అసెంబ్లీ, మండలి లోను కనీసం 20 మంది సభ్యులు బలం అవసరం. ఈ లెక్కన అసెంబ్లీలో వైసీపీకి ఒక్క పిఏసి సభ్యుడు కూడా ఎంపికయ్యే అవకాశం లేదు. మండలిలో మాత్రం ఒకటి లేదా ఇద్దరు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలు చేయకూడదని భావిస్తోంది. పీఏసీ సభ్యులతో పాటు చైర్మన్ ను సంప్రదాయం ప్రకారం నియమించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
* నామినేషన్ల గడువు
వాస్తవానికి పిఎసి చైర్మన్ తో పాటు సభ్యుల ఎన్నికకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సానుకూలత రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరుపున వైసీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఎసి చైర్మన్ పదవి విడిచి పెడుతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరో గంటలో ఏం జరుగుతుందో చూడాలి.