https://oktelugu.com/

High Court Bench : కర్నూలులో హైకోర్టు బెంచ్.. వైసీపీని ఫాలో అవుతున్న కూటమి!

జనాభా ప్రాతిపదికన.. అక్కడి ప్రజల అవసరాల పేరిట ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అదే చేస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది.అదే జరిగితే కర్నూలు బెంచ్ దేశంలో ఎనిమిదోదిగా గుర్తింపు పొందుతుంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 21, 2024 / 02:12 PM IST

    High Court Bench In Karnul

    Follow us on

    High Court Bench : వైసీపీ సర్కార్ మూడు రాజధానులకు మొగ్గు చూపింది. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలని భావించింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చింది.అయితే ప్రజలు దీనిని ఆహ్వానించలేదు.మూడు రాజధానుల అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓటు ద్వారా సమాధానం చెప్పారు.అయితే పాలన వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమకు ప్రాధాన్యమిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. వీలైనంత త్వరగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాయలసీమలో నాలుగు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. కానీ తమకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అక్కడి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తీర్మానించడం విశేషం.

    * సీఎంవో నుంచి లేఖ
    ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ కు ముఖ్యమంత్రి కార్యాలయం లేఖ రాసింది. దీనిపై కేంద్ర న్యాయ శాఖలో కూడా కదలిక ప్రారంభం అయింది. బెంచ్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేసే విషయం మీద హైకోర్టు రిజిస్టార్ కి కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటే కొన్ని విధానాలు ఉంటాయి. మొత్తం హైకోర్టుకు వచ్చే కేసులలో ఆ నాలుగు జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని కూడా చెబుతున్నారు.

    * జనాభా ప్రాతిపదికగా
    సాధారణంగా జనాభా ప్రాతిపదికగా బెంచ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏపీ జనాభా 4.95 కోట్లు. ఇందులో రాయలసీమ ప్రాంతంలో 1.59 కోట్లు మంది జనాభా ఉన్నారు. అంటే మొత్తం ఏపీ జనాభాలో 25 శాతం మంది రాయలసీమలో ఉన్నారన్నమాట. ఈ లెక్కను చూస్తే రాయలసీమలో ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేశారు. ఏడు రాష్ట్రాల్లో ప్రత్యేక బెంచ్ లు కొనసాగుతున్నాయి.కర్నూలు లో బెంజ్ ఏర్పాటు చేస్తే దేశంలో ఎనిమిదో బెంచ్ గా గుర్తింపు సాధిస్తుంది.