Chandrababu: ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు. ఇదేదో సినిమా డైలాగ్ అనుకోకండి. పొత్తులో భాగంగా చంద్రబాబుకు ఎదురయ్యే చిక్కుల గురించి చెబుతున్నాం. పొత్తుల వరకూ ఓకే కానీ.. సీట్ల సర్దుబాటు అనేది కష్టంతో కూడుకున్న పని. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషిచేసిన నాయకులను పక్కనపెట్టి.. మరో పార్టీకి సీటు కేటాయించడమనేది అంత ఈజీ అయ్యే పని కాదు. అప్పటివరకు పని చేసిన నేతను ఒప్పించాలి. ఆ నేత సహకారం తీసుకోవాలి. ఎన్నికల్లో సవ్యంగా పనిచేసేలా చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబుకు అటువంటి పరిస్థితి వచ్చింది. జనసేన, బిజెపిలకు దాదాపు 40 వరకు అసెంబ్లీ స్థానాలు, 10 వరకు పార్లమెంట్ స్థానాలు త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే టిడిపి హై కమాండ్ త్యాగం చేస్తుంది. కానీ త్యాగధనులుగా నిలిచే టిడిపి నాయకుల పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్న.
తెలుగుదేశం పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే లందరికీ టిక్కెట్లు కేటాయిస్తామని చంద్రబాబు ఏనాడో ప్రకటించారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు సర్దుబాటు చేయాల్సి ఉండడంతో గతంలో తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సి వస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కసుబుస్సు లాడుతున్నారు. తమ స్థానాలను తమకు కాకుండా వేరే పార్టీలకు కేటాయిస్తే తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే మాదిరిగా హెచ్చరిక చేశారు. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఆయన రూరల్ కు మారారు. రూరల్ నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు తనను కాదని మరొకరికి ఇస్తే సహకరించేది లేదని పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. దీంతో పొత్తుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. ఇదేమంత ఆషామాషీ విషయం కాదు. బిజెపికి ఏపీలో బలం అంతంత మాత్రమే. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 0.8% ఓట్లు వచ్చాయి. జనసేనకు సైతం 10 శాతం లోపు ఓట్లు లభించాయి. ప్రస్తుతం జగన్ సర్కార్ పై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది. దీంతో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఇటువంటి సమయంలో టిడిపికి ప్రజా వ్యతిరేక ఓటు తోడైతే సునాయాస విజయం దక్కే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే.. వైసీపీ గట్టెక్కుతుందని టిడిపి భయపడుతోంది. అందుకే అటు జనసేన, ఇటు బిజెపితో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. కానీ టిడిపి అనివార్య పరిస్థితిని చూసిన ఆ రెండు పార్టీలు సీట్ల విషయంలో డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సీట్ల సర్దుబాటు విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు చంద్రబాబుకు.
ప్రస్తుతం పొత్తులో భాగంగా కోల్పోనున్న నియోజకవర్గాల టిడిపి నేతలతో చంద్రబాబు నేరుగా మాట్లాడుతున్నారు. బుజ్జగింపులకు దిగుతున్నారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహ పడొద్దని చెబుతున్నారు. పార్టీని నమ్ముకున్న నేతలకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఎవరికోసమో తమ నాయకత్వాన్ని బలి పెట్టాలంటే ఎలా సాధ్యమవుతుందని ఎక్కువ మంది నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఎన్నో రకాల ఇబ్బందులు పడి పార్టీని నిలబెట్టామని… ఇప్పుడు ఎవరి పల్లకి మోయలేమని అధినేతకు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు త్యాగం చేస్తే నియోజకవర్గాలను వదులుకోవాల్సి వస్తుందని.. తమ పట్టు పోతుందని.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయ లీడర్ను ఎదగనించే ప్రశ్న ఉండదని బాధిత నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా చెప్పినా క్షేత్రస్థాయిలో క్యాడర్ సైతం పనిచేసే అవకాశం ఉండదని కూడా తెలుస్తోంది. పొత్తుల ముందు టిడిపికి, చంద్రబాబుకు ఇది ఇబ్బందికర పరిణామమే.